ఘనంగా ఇందిరమ్మ గృహ ప్రవేశ మహోత్సవం
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని శనిగపురం గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమం(Indiramma House Warming Ceremony) అత్యంత వైభవంగా జరిగింది. గ్రామానికి చెందిన జావధి శివ కృష్ణ కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ గృహం నిర్మాణం పూర్తి చేసుకొని, నూతన గృహ ప్రవేశ మహోత్సవానికి మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గృహప్రవేశానికి ప్రారంభోత్సవం నిర్వహించి, నూతన గృహంలో అడుగుపెట్టిన శివ కృష్ణ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ మాట్లాడుతూ... పేదల సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతీ అర్హులైన నిరుపేద కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.






