12 August, 2026 | 5:42 PM

ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగించేనా?

12-08-2026 12:16 AM

రోడ్డుపైనే నడుస్తున్న పాదచారులు.. 

నిత్యం జరుగుతున్న ప్రమాదాలు

సుప్రీంకోర్టు ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం

కల్వకుర్తి, ఆగస్టు 11 (విజయక్రాంతి): పాదచారుల కోసం నిర్మించిన ఫుట్పాత్లు ఆక్రమణలకు గురికావడంతో ప్రజలు రోడ్డుపైనే నడవాల్సిన దుస్థితి నెలకొంది. వారి భద్రతను పట్టించుకోక పోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదనే విమర్శలున్నాయి.

తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆక్రమణలపై దృష్టి సారించింది. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం మీదుగా నిర్మితమైన కోదాడజడ్చర్ల జాతీయ రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర ఫుట్పాత్లు నిర్మించారు. అయితే ప్రస్తుతం వాటిలో ఎక్కువ భాగం ఆక్రమణలకు గురయ్యాయి. డ్రైనేజీలపై, ఫుట్పాత్లపై వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. కొందరు రాత్రికి రాత్రే డబ్బాలు వేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తుండగా, మరి  కొందరు సమీపంలోని దుకాణాల యజమానులు ఫుట్పాత్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

రోడ్డు నిర్మాణ సమయంలో ఇరువైపులా నాటిన మొక్కలను సైతం తొలగించి వ్యాపారాలకు ఉపయోగించుకుంటున్నా మున్సిపల్, జాతీయ రహదారి అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఫుట్పాత్లు ఆక్రమణకు గురికావడంతో రెండు వరుసల రహదారి సైతం క్రమంగా ఇరుకుగా మారింది. పాదచారులు నడవాల్సిన ప్రదేశాలు వ్యాపారాలకు అడ్డాగా మారడంతో వాహనాల మధ్య రోడ్డుపైనే నడవాల్సి వస్తోంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.

నోటీసులతోనే సరిపెడుతున్నారా?. . 

గతంలోనూ ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. తాజాగా జాతీయ రహదారి నిర్మాణ సంస్థ ఆదేశాల మేరకు అధికారులు ఆక్రమణదారులకు నోటీసులు అందజేస్తున్నారు. రహదారి అధికారులు సైతం మార్కింగ్ చేసి వెళ్లారు.  ఈసారి అయినా ఫుట్పాత్లను పూర్తిగా ఆక్రమణల నుంచి విముక్తి చేసి పాదచారులకు అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

చౌరస్తా అభివృద్ధిపై అందరి దృష్టి...

కల్వకుర్తి పట్టణం మీదుగా వెళ్లే జాతీయ రహదారి మూడు ప్రధాన చౌరస్తాలను కలుపుతోంది. నిబంధనల ప్రకారం చౌరస్తాలను మరింత విశాలంగా అభివృద్ధి చేయాల్సి ఉన్నప్పటికీ, గతంలో పూర్తిస్థాయి విస్తరణ చేపట్టకుండా ఉన్న రోడ్డునే కొంతమేర అభివృద్ధి చేసి అధికారులు చేతులు దులుపుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా పట్టణంలోని మహబూబ్నగర్ చౌరస్తా నిత్య ప్రమాదకర కూడలిగా మారింది. చౌరస్తాకు అతి సమీపంలోకి వచ్చే వరకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడం, భారీ వాహనాలు మలుపు తీసుకునేందుకు తగినంత స్థలం లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాజకీయ ఒత్తిళ్లే కారణమా?

చౌరస్తా విస్తరణ, ఆక్రమణల తొలగింపులో గతంలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే పనులు చేపట్టలేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మహబూబ్నగర్ చౌరస్తా విస్తరణకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాణాలను తొలగించేందుకు చౌరస్తాలో కొలతలు చేపట్టి ఇరువైపులా మార్కింగ్ చేశారు. దీంతో ఇకనైనా మహబూబ్నగర్ చౌరస్తా అభివృద్ధి చెందుతుందని పట్టణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు ఇచ్చిన నోటీసులు, చేసిన మార్కింగ్లు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతాయా? లేక నిజంగానే ఆక్రమణలను తొలగించి పాదచారులకు ఫుట్పాత్లను అందుబాటులోకి తీసుకువస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.