సాహితీ సామ్రాజ్ఞి!
కళ్లముందుకు వస్తావు,
చూపులు పట్టేస్తావు,
దృశ్యాన్ని చూపుతావు,
అందాల బొమ్మను చేయిస్తావు
తలలోకి దూరతావు
ఆలోచనలు పారిస్తావు
భావాన్ని పుట్టిస్తావు,
చక్కని రూపాన్ని ఇప్పిస్తావు
తెల్ల కాగితాన్ని ఇస్తావు
కలాన్ని చేత పట్టిస్తావు
నల్లని అక్షరాల్ని గీయిస్తావు
కమ్మని కవితను కూర్పిస్తావు
మట్టి ప్రమిదను అందిస్తావు
నూనెను నిండుగా నింపిస్తావు
చిరు దివ్వెను వెలిగిస్తావు
కాంతి కిరణాల్ని వెదజల్లిస్తావు
అంధకారమై ఆవరిస్తావు
జాబిలిని పొడిపిస్తావు
ఏడు రంగులను చూపిస్తావు,
కుంచెను చేతబట్టమంటావు,
విచిత్ర చిత్రాన్ని తయారుచేయిస్తావు
నల్లరాయిని విసురుతావు
ఉలిని పట్టుకోమంటావు
బండను చెక్కమంటావు
సుందర శిల్పాన్ని చేయిస్తావు
సముద్రానివై వస్తావు
నదిలా పారమంటావు
జీవిత పయనం సాగించమంటావు
నీలో చివరకు కలుపుకుంటావు
నిశ్శబ్దాన్నై కూర్చుంటే
నాలో మాటలు మేల్కొలుపుతావు
నిరాశలోనూ దీపమవుతావు
జీవితనౌకకు దారిచూపే దిక్సూచివవుతావు
సాహితీ సామ్రాజ్ఞివై వస్తావు
సృష్టికి సింహాసనం వేస్తావు
నా శ్వాసలో శబ్దమవుతావు !!






