24-02-2026 01:06:29 AM
గాంధారి, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి 3వ వార్షికోత్సవ మహోత్సవంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ రావు సోమవారం పాల్గొన్నారు. గాంధారి మండల కేంద్రంలో నిర్వహించినటువంటి ఈ పవిత్ర వేడుకకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వాదాలు స్వీకరించి, ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ బుర్రకథ కార్యక్రమాన్ని వీక్షించి కళాకారులను అభినందించారు. భక్తుల సమక్షంలో జరిగిన ఈ ఉత్సవం భక్తి భావనతో నిండి, గాంధారి పట్టణంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.