న్యాయం కోసం జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ముందు వృద్ధుడి నిరసన
జిన్నారం/అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ మండల వైద్యాధికారి రవిశంకర్ (82) తన భూమి వివాదానికి పరిష్కారం కోరుతూ జిన్నారం మండల రెవెన్యూ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. రెవెన్యూ శాఖ చేసిన పొరపాటుతో తమ భూమి ఇతరుల పేరుపై నమోదైందని ఆరోపిస్తూ న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. రవిశంకర్ బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, శివానగర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 172/ఇ లో ఉన్న 14 గుంటల భూమిని రవిశంకర్ 2007లో కొనుగోలు చేశారు.
అప్పట్లో పాత పాస్‌బుక్ కూడా జారీ అయిందన్నారు. అనంతరం కొత్త పాస్‌బుక్‌ల ప్రక్రియలో తమ భూమికి సంబంధం లేని వ్యక్తుల పేర్లపై నమోదు జరిగిందని ఆరోపించారు. రవిశంకర్ కుమారులు అమెరికాలో ఉండటంతో భార్యాభర్తలు అక్కడే నివసిస్తూ వచ్చారని, ఈ సమస్య పరిష్కారం కోసం గత ఐదు నెలల క్రితం భారత్‌కు వచ్చి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఈ విషయమై 11 జూన్ 2025 న ప్రజాపాలన కార్యక్రమంలో కూడా ఫిర్యాదు అందజేసినప్పటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
తహాశీల్దార్, ఆర్డీఓ, ఎమ్మార్వో అధికారులను పలుమార్లు కలిసినా “ప్రపోజల్ పంపించాం” అనే సమాధానం మాత్రమే వస్తోందని, అదనపు కలెక్టర్‌ను కలిసినా సమస్యపై స్పందన లభించలేదని బంధువులు ఆరోపించారు. వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఇటీవల బాత్‌రూమ్‌లో జారి పడటంతో చికిత్స కోసం భారీగా ఖర్చు అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. నెల రోజుల్లో తిరిగి అమెరికాకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. తన సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్యాలయం ముందు నుంచి వెళ్లబోనని రవిశంకర్ స్పష్టం చేసినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనలో వృద్ధుడికి ఏదైనా అనర్థం జరిగితే దానికి రెవెన్యూ శాఖే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు. ఈ వివరాలు రవిశంకర్ కుటుంబ సభ్యులు మరియు బంధువులు చేసిన ఆరోపణల ఆధారంగా అందించబడినవి. అధికారుల స్పందన అందాల్సి ఉంది.






