3 June, 2026 | 4:10 AM

పొలంలో మంటలు ఆర్పేందుకు వెళ్లి వృద్ధుడి సజీవ దహనం

03-06-2026 12:00 AM

మంచిర్యాల జిల్లా జన్నారంలో ఘటన

జన్నారం, జూన్ 2(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పొలంలో మంటలను ఆర్పుతూ ఓ వృద్ధుడు సజీవదహనమయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రేగుంట పోచం(70) అనే వృద్ధుడికి గ్రామ శివారులో వ్యవసాయ పొలం ఉంది. మంగళ వారం ఆయన పొలం పక్కనే ఉన్న వరికోయలను (వరి దుబ్బులను) కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. మంటలు వేగంగా వ్యాపిస్తుండటాన్ని గమనించిన పోచం, వాటిని అదుపు చేసేందుకు అక్కడికి వెళ్లారు.

దురదృష్టవశాత్తూ ఆసునూరి బాప న్న పొలం వద్ద ఉన్న రహదారి సమీపంలో ప్రమాదవశాత్తు మంటల్లో పడిపోవడం, మంటల తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో ఆయన అందులోనే చిక్కుకుపోయి తీవ్రంగా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో తిమ్మాపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న జన్నారం ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోచం కుమారుడు ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.