3 June, 2026 | 5:07 AM

13న జాతీయ లోక్‌అదాలత్

03-06-2026 12:00 AM

మేజిస్ట్రేట్ అరుణ్ కుమార్ 

ఆమనగల్లు, జూన్ 2(విజయక్రాంతి): రాబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమనగల్లు మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ అరుణ్ కుమార్ నారం పిలుపునిచ్చారు. జూన్ 13న నిర్వహించబడనున్న జాతీయ లోక్ అదాలత్ పురస్కరించుకొని, మంగళవారం సాయంత్రం ఆమనగల్లు కోర్టులో ఆయన అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. కోర్టుల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించడమే లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశమన్నారు. రాజీపడదగ్గ (కాంపౌండబుల్) కేసులు, అడ్మిషన్ కేసులు, మరియు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పీటీ కేసులను త్వరితగతిన గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఆయా కేసులకు సంబంధించిన ఇరు పక్షాల వారితో ముందే సమన్వయం చేసుకొని, ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని సూచించారు.

బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చేందుకు పోలీస్ శాఖ, ప్రాసిక్యూషన్ శాఖ, ఎక్సైజ్ శాఖ మరియు న్యాయ శాఖ అధికారులు పరస్పరసమన్వయంతో,బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ బి. కార్తీక్, ఆమనగల్లు పోలీస్ ఇన్స్పెక్టర్లు ఎస్. వెంకటేశ్వర్లు, కడ్తాల్, మడ్గుల, తలకొండపల్లి పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్స్పెక్టర్లు, సీడీఓ అధికారులు మరియు ఆమనగల్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.