calender_icon.png 10 February, 2026 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

10-02-2026 12:56:25 AM

పోస్టల్ బ్యాలెట్ సక్రమంగా నిర్వహించాలి: కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్/కాగజ్‌నగర్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి):2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలు, పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల్లో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత ఆదేశించారు. సోమవారం ఆసిఫాబాద్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం,

పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. అలాగే కాగజ్నగర్లోని డి.ఏ.వి. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రాలను అదనపు కలెక్టర్  డేవిడ్తో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన 3వ ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు 28 పోలింగ్ కేంద్రాలు, కాగజ్‌నగర్‌లో 30 వార్డులకు 85 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి

మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం కాగజ్నగర్ పట్టణంలో నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ మార్చ్లో ఎస్పీ నితిక పంత్తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం ముగిసిందని, పోలింగ్కు సంబంధించి అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు.

ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. ప్రలోభాలను అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పోలింగ్కు ముందు లేదా పోలింగ్ రోజున ఓటర్లను ప్రభావితం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎటువంటి సమాచారం ఉన్నా స్థానిక ఎన్నికల అధికారులు లేదా కంట్రోల్ రూమ్కు తెలియజేయాలని కోరారు. ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీ బందోబస్తు, నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఫ్లాగ్ మార్చ్ పట్టణంలోని పలు కూడళ్ల గుండా సాగింది. ఈ కార్యక్రమంలో సీఐలు ప్రేమ్ కుమార్, సంతోష్, కుమారస్వామి, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.