మళ్లీ పొడి వాతావరణం
- హిమాలయ సానువుల వైపు రుతపవన ద్రోణి
- పడమర నుంచి భారత్‌లోకి పొడిగాలులు
- వర్షాలకు బ్రేక్.. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలు
- నెలాఖరున వానలు పుంజుకునే అవకాశం: ఐఎండీ
న్యూఢిల్లీ, జూలై ౧౧: నైరుతి రుతుపవనాలు జూన్ నెల అంతా ఉసూరుమనించాయి. జూలైలో కాస్త కదలిక వచ్చి, దేశమంతా రుతుపవనాలు విస్తరించి, వానలు కురుస్తున్నాయని ఆనందపడ్డాం. లోటు వర్షపాతాన్ని భర్తీ చేస్తుందని ఆశించాం. కానీ, ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. వానలు మొదలైన తొమ్మిది రోజులకే వానలకు బ్రేక్ పడింది. అందుకు కారణం.. ప్రస్తుతం రుతుపవనాల ద్రోణి హిమాలయ సానువుల వైపునకు పయనిస్తుండటమే. దీంతో పడమర దిశ నుంచి భారత్‌లోకి పొడి గాలులు ప్రవేశిస్తున్నాయి. అవి కురిసే ఆ కాస్త వర్షపాతాన్ని సైతం నిరోధిస్తున్నాయి. ఫలితంగా రోజు వారి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
ఈ ప్రభావం తెలంగాణతో ఉత్తరాదిన అనేక రాష్ట్రాలపై పడింది. ఆయా రాష్ట్రాల్లో వేసవిని తలపించేలా ఎండలు కాస్తున్నాయి. వానాకాలంలో ఇలాంటి తాత్కాలిక విరామాలు సహజమే అయినప్పటికీ, జూలై మధ్యలోనే విరామం రావడం వ్యవసాయ రంగానికి చుక్కెదురే అని చెప్పాలి. సాగునీటి సౌకర్యం లేని రైతులు ఈ పొడి వాతావరణం వల్ల అనేక సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితులు దాపురించే ప్రభావం ఉంది. అయితే.. నెలాఖరులోపు మళ్లీ వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తున్నది. కానీ, రుతుపవన ద్రోణికి దగ్గరగా ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.






