18 July, 2026 | 7:59 PM

మూడు వారాలలో 559 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

18-07-2026 07:31 PM

 -  52 లక్షల 80 జరిమానాలు

  - 31 మందికి వారం రోజులు జైలు శిక్షలు

 - వివరాలు వెల్లడించిన సీపీ

ఆర్మూర్, (విజయక్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన మూడు వారాల్లో 559 మంది డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో వెల్లడించారు. వారిని నిజామాబాదు, అర్మూర్, బోధన్ కోర్టులలో హాజరు పర్చగా ఇందులో 31 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని, మిగిలిన వారికీ 52 లక్షల 80 వేల జరిమానా విధించినట్లు వెల్లడించారు. జూన్ 29 నుంచి జులై 17వరకు కమిషనరేట్ పరిధిలో చేసిన తనిఖీలలో అధిక మొత్తములో మద్యం త్రాగి వాహనములు నడిపి పోలీసులకు పట్టుబడటం జరిగిందని పేర్కొన్నారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని  నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ప్రజలు మద్యం సేవించి  వాహనాలు నడపరాదని సీపీ కోరారు. వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి  పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు.

డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారి లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మద్యం త్రాగి వాహనం నడిపి అనుకోని రోడ్ ప్రమాదం జరిగినట్లయితే ఇన్సూరెన్సు లభించదని వెల్లడించారు. మైనర్లు తాగి వాహనం నడిపి పోలీస్ వారికి దొరికినటైతే మైనర్ మరియు వెహికల్ ఓనర్ పైన ఛార్జ్ షీట్ నమోదు చేయడమేగాకుండా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని అన్నారు.

ఒక సారి కంటే ఎక్కువ సార్లు పట్టుబడినట్లయితే జైలు శిక్ష విధించడం జరుగుతుందని వివరించారు. మోటర్ వెహికల్ యాక్ట్ అమలులో ఉన్నందున డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడినట్లయితే 10 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా తో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.  అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండోసారి పట్టుబడినట్లైతే 15,000/- జరిమానా లేదా జైలు శిక్ష లేదా జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు.