పారా అథ్లెటిక్స్‌లో డబుల్ ధమాకా
- చరిత్ర సృష్టించిన దిలీప్ గవిత్, మహ్మద్ బాసిల్
- పురుషుల 100మీ.లో స్వర్ణం, రజతం
గ్లాస్గో, జూలై 30 : కామన్‌వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్‌లో భారత అథ్లెట్లు స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనతో అదరగొడుతున్నారు. తాజాగా పారా అథ్లెట్లు దిలీప్ మహాదు గవిత్, మహమ్మద్ బాసిల్ సరికొత్త చరిత్ర సృష్టించారు. పురుషుల 100 మీటర్ల టీ47 ఈవెంట్‌లో స్వర్ణం ,రజతం గెలిచి సత్తా చాటారు. దిలీప్ కేవలం 10.71 సెకన్లలో రేసును ముగించి సరికొత్త కామన్‌వెల్త్త్ గేమ్స్ రికార్డుతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.తద్వారా పారా-అథ్లెటిక్స్ ట్రాక్ విభాగంలో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ పురుష అథ్లెట్‌గా దిలీప్ రికార్డు సృష్టించాడు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించాడు. 5 ఏళ్ల వయసులో చెట్టుపై నుంచి పడిపోవడంతో కుడి చేయి మోచేయి కింది భాగాన్ని కోల్పోయాడు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇతనికి కోచ్ వైజానాథ్ కాలే ఆశ్రయం కల్పించి, సొంత కొడుకులా చూసుకుంటూ అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌గా తీర్చిదిద్దారు. అలాగే కేరళకు చెందిన మహ్మద్ బాసిల్ అత్యుత్తమ ప్రదర్శనతో 10.83 సెకన్లలో రేసును పూర్తి చేసి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. పుట్టుకతోనే కుడి చేయి లేకుండా జన్మించిన బాసిల్, 16 ఏళ్ల వయసులో రన్నింగ్ ప్రారంభించాడు. గోస్పోరట్స్ ఫౌండేషన్ మద్దతుతో, కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే జాతీయ స్థాయిలో ఆసియా రికార్డు (10.63 సెకన్లు) నెలకొల్పి, తన మొదటి అంతర్జాతీయ టోర్నీలోనే రజత పతకంతో సత్తా చాటాడు. మరోవైపు లాంగ్ జంప్‌లో మురళీ శ్రీ శంకర్ రజతం సాధించాడు. అందుకొన్నాడు. ఇక భారత బాక్సర్లు 10 పతకాలను ఖాయం చేశారు.






