దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
- మూడు విడతలుగా డిగ్రీ అడ్మిషన్లు
- జూలై 1 నుంచి క్లాసులు ప్రారంభం
- 969 కాలేజీలు 4.40 లక్షల సీట్లు
- ఉన్నత విద్యామండలి చైర్మన్ వీ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2026--27 విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)--2026 నోటిఫికేషన్‌ను జారీ చేశారు. రిజిస్ట్రేషన్లను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు.
మొత్తం మూడు దశల్లో డిగ్రీ అడ్మిషన్లను చేపట్టనున్నట్టు చెప్పారు. జూలై 1 నుంచి క్లాసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైన్ చైర్మన్లు ప్రొఫెసర్లు పురుషోత్తం, ఎస్‌కే.మహమూద్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ కొత్త కోర్సుల వివరాలను దోస్త్ వెబ్ సైట్లో పొందుపరుస్తామన్నారు. ఈ నెల 30 నుంచి వెబ్ ఆప్షన్లు ఉన్న నేపథ్యంలో ఆ లోపుగా యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపును పూర్తి చేసేలా చూడాలని సూచించామన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కూడా కొత్త కోర్సుల ప్రవేశాలపై 30లోపుగా నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 969 కాలేజీల్లో 4,40,107 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
నాన్ దోస్త్ కాలేజీలు 60 ఉన్నాయన్నారు. మూడు సంవత్సరాలుగా అడ్మిషన్లు జరగని కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వకుండా ఉండే నిబంధనలను అమలు చేసేలా చూడాలని యూనివర్సిటీలకు సూచిస్తామన్నారు. రాష్ట్రంలో గత ఏడాది జీరో అడ్మిషన్ పొందిన కాలేజీలు 54 ఉండగా వాటిలో ఒకటి ప్రభుత్వ డిగ్రీకాలేజీ కూడా ఉందని, ఫేజ్--1 రిజిస్ట్రేషన్లను ఈ నెల 15 నుంచి మే 7వరకు కొనసాగించనున్నారు. మే 14న తొలిదశ సీట్ల కేటాయింపు జరగనుందన్నారు.
రెండో దశ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 15 నుంచి మే 25 వరకు కొనసాగనుంది. మే 30న సెకండ్ ఫేజ్ సీట్లు కేటాయించనున్నారని తెలిపారు. మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 31 నుంచి జూన్ 15 వరకు జరగనుందని, జూన్ 20న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు.
అన్ని విడతల్లోనూ సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో జూన్ 20 నుంచి 27 మధ్యలో హాజరై అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని, జూలై 1 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఇదిలా ఉండగా యూనివర్సిటీల వీసీల సమావేశంలో యూజీ, పీజీ, ఇంజినీరింగ్ కోర్సుల క్రెడిట్ స్కోర్‌పైన చర్చించారు. కొత్తకోర్సులు, ఎన్‌ఈపీ అమలు తదితర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.




