5 March, 2026 | 3:45 AM

ఈఎస్‌ఐపై పట్టింపేదీ?

05-03-2026 12:21 AM
  1. కార్మిక శాఖలో నిర్లిప్తత!

15 డిస్పెన్సరీలు రద్దు అయినా.. డోంట్‌కేర్

29 డిస్పెన్సరీలను ఇబ్బందులు కలిగే ప్రాంతాలకు తరలిస్తున్నా మౌనం

మెడికల్ డైరెక్టర్‌ను నియమించకుండా.. ఐఏఎస్‌లకు ఈఎస్‌ఐ బాధ్యతలు

సుమారు కోటి మంది ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా కార్మిక శాఖ

‘విజయక్రాంతి’ కథనాలతో సీఎంవోకు ఫిర్యాదు చేసిన ఈఎస్‌ఐ లబ్ధిదారులు

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి) : ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 25లక్షల మంది వరకు లబ్ధిదారులు.. వారికుటుం బ సభ్యులతో కలిపితే.. ఒక కోటి వరకు ఉండే చిరుద్యోగులు, కార్మికుల ఆరోగ్యంపై రాష్ట్ర కార్మిక శాఖ పూర్తి నిర్లక్ష్యంగా.. నిస్తేజంగా.. నిర్లిప్తతతో వ్యవహరిస్తోందని లబ్ధి దారులే తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ..

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ (ఈఎస్‌ఐ) విభాగం కునారిల్లుతున్నా.. కార్మిక శాఖ పట్టించుకున్న దాఖ లాలు కనపడటం లేదని ముక్తకంఠంతో చెబుతున్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 29ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను ఇష్టారా జ్యంగా.. ఎలాంటి వసతులు లేని ప్రాంతాలకు తరలించాలనే ఆదేశాలపై సర్వత్రా మండిపడుతున్నారు. 

మొదటి నుంచి చిన్నచూపే..

రాష్ట్రంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రులతోపాటు.. సుమారు 80వరకు డిస్పెన్సరీలను నిర్వహించేందుకు కేంద్రం ప్రతియేటా రూ.500 కోట్ల వరకు నిధులను కేటాయించేది. అయితే డిస్పెన్సరీలకు చెల్లిస్తున్న అద్దె లు, నిర్వహణ విషయంలో ఖర్చు భారీగా చూపిస్తూ.. సరిగా పట్టించుకోవడం లేదనే సాకుతో.. నిధుల్లో 50 శాతం కోత పెట్టింది. దీనితో ఏటా రూ.250 కోట్ల వరకే నిధులు వస్తున్నాయి.

అయితే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి మొదటి నుంచి ఈఎస్‌ఐపై చిన్నచూ పుతోనే వ్యవహరిస్తుందని అందరిలోనూ అసంతృప్తి నెలకొంది. కేంద్రం నుంచి ఠంచనుగా నిధులు విడుదల అవుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాల మేరకు ఆ నిధులను మళ్లిస్తోందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నా యి. అలాగే.. డాక్టర్లు, ఫార్మాసిస్టుల లాంటి ఉద్యోగస్తుల భర్తీ, జీతభత్యాలు, కాం ట్రాక్టు ఉద్యోగుల నియామకం, వసతుల ఏర్పా టు లాంటి అంశాలను పట్టించుకోకుండా..

రాష్ట్రం లో సుమారు 25 శాతం మంది ప్ర జల (కోటి మంది)కు సం బంధించిన వైద్య వ్యవస్థను చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారనే చెప్పవచ్చు. ప్రభుత్వమే నిధులను మళ్లిస్తుంటే.. అం దులో పనిచేసే ఉద్యోగులు, అధికారులు ఏం పనిచేస్తారు.. ఎలా పనిచేస్తారు.. పర్యవేక్షణ ఎక్కడ ఉం టుంది. దీనితో ఎవరికివారు ఇష్టారాజ్యంగా వ్యవహ రిసు ్తన్నారని ప్రతిసారీ.. ఈఎస్‌ఐ లబ్ధిదా రులు, ఉద్యోగస్తులు, సిబ్బంది బలంగా చెబుతున్నారు.

మెడికల్ డైరెక్టర్ ఎక్కడ?

వాస్తవానికి ఈఎస్‌ఐ వ్యవస్థను చూడటానికి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి రెగ్యులర్ డైరెక్టర్ ఉండా లి. కానీ రాష్ట్ర ప్రభు త్వం (కార్మిక శాఖ) ఈ విషయం పట్టించుకోవడం లేదు. గతంలో జరిగిన నిధుల గోల్‌మాల్ నేపథ్యంలో.. ఐఏఎస్ అధికారులకే ఆ బాధ్యత లను అద నంగా అప్పగిస్తున్నారు. కొంత కాలంగా సీనియర్ ఐఏఎస్ దానకిశోర్‌కు ఈఎస్‌ఐ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను చూస్తున్నారు.

ప్రభుత్వంలోని అనేక కీలక శాఖలు, విభాగాలతోపాటు గవర్నర్‌కు కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనేక ముఖ్యమైన శాఖలు ఉండటం తో.. వాటిని చూడటానికే సమయం సరిపోని పరిస్థితి ఉంది. అయితే అధికారి సమ ర్థుడైనా.. అదనపు బాధ్యతలను చూసే సమ యం ఉండటం లేదు. గడిచిన కొన్నేళ్లుగా ఐఏఎస్‌లకే అదనపు బాధ్యతలు అప్పగిస్తుం డటం తో.. ఈఎస్‌ఐ పరిస్థితి పెనంమీది నుంచి పొయ్యిలో పడినట్టుగా ఉంది.

నిధుల ఖర్చు, పర్యవేక్షణ, ఉద్యోగుల భర్తీ, డిస్పెన్సరీల నిర్వహ ణపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఈఎస్‌ఐలోని అధికారులు, వైద్యులు, సిబ్బందిలో క్రమశిక్షణ లోపించింది. వ చ్చాం.. వెళ్లాం, అన్నట్టుగా వారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే.. నిరంతరం పర్యవేక్షణ చేసేలా మెడి కల్ డైరెక్టర్‌ను నియమించాలని ఉద్యోగులుసైతం చెబుతున్నారు. ఈఎస్‌ఐలో పనిచే స్తున్న వారికి వీటి నిర్వహణపై అవగాహన ఉంటుంది.

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉం టుంది. మిగతా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సక్రమంగా పనిచేస్తారు. కానీ ఐఏఎస్‌లు కావడంలో.. ఏ ఒక్కనాడు కూడా ఈఎస్‌ఐలను సందర్శించిన పాపాన పోలే దు. ఇక ఈ విభాగంలో ఉన్న ఇతర ఉన్నతాధికారులు కేవలం ఒకరిపై ఒకరు ఆరోప ణలు, ఆమ్యామ్యాలు తీసుకోవడం వరకే పరిమితం అయ్యారనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్ డైరెక్టర్‌ను నియమించి.. పనితీరును పర్యవేక్షించుకుంటే.. ఈఎస్‌ఐ సేవలను  నాణ్యంగా అందించవచ్చని లబ్ధిదారులు అంటున్నారు.

సీఎంవోకు ఫిర్యాదు..

గడిచిన ఐదారు ఏండ్లుగా ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం కారణంగా కునారిల్లిన వ్యవస్థపై.. తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఈఎస్‌ఐ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకు నే ప్రమాదంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో ‘విజయక్రాంతి’ దినపత్రికలో ఈ మధ్య కాలంలో ఈఎస్‌ఐ అసుపత్రులు, డిస్పెన్సరీలు, నిధుల మళ్లిం పు, రెగ్యులర్ డైరెక్టర్ లేకపోవడం, డిస్పెన్సరీల తరలింపుపై వచ్చిన వరుస కథనాలను ఉటంకి స్తూ.. ఈఎస్‌ఐ లబ్ధిదారులు సీఎం కార్యాలయానికి తాజాగా ఫిర్యాదు చేశారు.

ఈ పరిస్థితుల్లో ఈఎస్‌ఐ లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారికి సరైన వైద్య సేవలు అం దడంలేదని, డిస్పెన్సరీల్లోని ఉద్యోగులు, వైద్యులు, సిబ్బం ది విధులు నిర్వర్తించడానికి తీవ్ర విఘాతం కలుగుతుందని సీఎంవోకు పంపించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న నేపథ్యంలో.. కనీసం సీఎం వో నుంచి అయినా సరైన ఆదేశాలు జారీచేస్తే.. స్పష్టమైన సూచనలు అంది తే.. ఈఎస్‌ఐని గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటారని లబ్ధిదారులు ఆశిస్తున్నారు.

రద్దు చేసినా.. తరలించినా.. నిర్లక్ష్యమే

నిజానికి ఎప్పుడో 8 ఏండ్ల క్రితం మన రాష్ట్రానికి 15 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను కేంద్రం మంజూరు చేసింది. వీటిని సకాలంలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలోని కార్మిక శాఖదే. కానీ అటువేపు కార్మిక శాఖ దృష్టి పెట్టలేదు. దీనితో వేచి చూసిన.. కేంద్రం తాజాగా ఆ 15 డిస్పెన్సరీలను రద్దు చేసింది. అయినా.. ఒక్క మాటకూడా కార్మిక శాఖ నుంచి, కార్మిక శాఖ మంత్రి నుంచిగానీ బయటకు రాలేదు. కొన్ని వేల మందికి వైద్య సేవలు అందించే అవకాశాన్ని కాలదన్నుకున్నట్టుగా కార్మిక శాఖ వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

ఇక ప్రైవేటు భవనాల్లో అద్దెలు చెల్లించడం కష్టమవుతోందనే ఉద్దేశంతో..ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, బస్తీ దవాఖా నాల్లోకి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 29 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను తరలించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ప్రభు త్వ భవనాల్లో కనీస వసతులున్నాయా.. సౌకర్యాలున్నాయా.. ఎంత విస్తీర్ణం ఖాళీ ఉందనే అంశాలను కూడా పరిశీలించకుండానే 29 డిస్పెన్సరీలను తరలించడానికి ఉత్తర్వులు జారీచేయ డంపై.. అటు లబ్ధిదారులు, ఇటు ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని చోట్ల వెళ్లడానికి దారికూడా సరిగా లేదు. మరికొన్ని భవనాల విస్తీర్ణం సరిపోదు. మూత్రశాలలు లేవు. మెట్లు లేవు. పోలీసు స్టేషన్‌పైకి వెళ్లాలంటే భయం.. ఇలా అనేక ఇబ్బందులు ఉండటంతో డిస్పెన్సరీల వైద్యులు, సిబ్బంది ససేమిరా అంటున్నారు. ఇక లబ్ధిదారుల బాధలు వర్ణనాతీతం. కనీసం డిస్పెన్సరీలను ఎక్కడికి మార్చారో కూడా వారికి తెలియడం లేదు.