28 July, 2026 | 1:04 AM

ఎమ్మెల్యే సామేల్‌ను అవమానిస్తారా?

28-07-2026 12:16 AM
  1. కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించాలి
  2. మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు 

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ఎస్సీ ఎమ్మెల్యే సామేల్‌పై ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలను అఖిల భారత బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, ఆ వ్యాఖ్యలను ఖండించాల్సిన కాంగ్రెస్ నాయకులు వాటిని సమర్థించే ప్రయత్నం చేయడం మరింత ఆందోళన కలిగిస్తోందని మాజీ డీజీపీ, అఖిల భారత బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త డా. జె. పూర్ణచంద్రరావు, చందా లింగయ్య దొర అన్నారు.

ఎస్సీ ప్రజాప్రతినిధిని బహిరంగంగా కించపరచడం, అవమానించడం రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి అని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా, ఆధిపత్య కులాల భూస్వామ్య, కుల అహంకార రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి రుజువు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, బలహీన వర్గాల హక్కుల గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఈ ఘటనపై వెంటనే స్పందించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి కుల అహంకార ధోరణులను సహిస్తారా? లేక రాజ్యాంగ విలువలకు కట్టుబడి చర్యలు తీసుకుంటారా? దేశ ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఘటనపై మౌనం వీడాలని, తగిన చర్యలు తీసుకోవాలని మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ సమాజానికి చెందిన నాయకుడిగా సామాజిక న్యాయానికి అండగా నిలవాలని కోరారు.

రాజగోపాల్‌రెడ్డి తన అవమానకర వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, సామేల్‌కు, ఎస్సీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, శాసనసభలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడేందుకు అన్ని పార్టీలు ఉమ్మడి వైఖరి ప్రకటించాలని కోరారు.