31 May, 2026 | 6:23 PM

వరికొయ్యలు, పంట అవశేషాలను కాల్చొద్దు

31-05-2026 04:52 PM

• ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి

ధర్మపురి,(విజయక్రాంతి): ధర్మపురి మండలంలోని రైతులు వరికోతల అనంతరం పోలాల్లో మిగిలిన వరి కోయ్యలు, ఇతర పంటల అవశేషాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చవద్దని ధర్మపురి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాం నర్సింహారెడ్డి సూచించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల గాలి కాలుష్యం తీవ్రంగా పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇబ్బందులు కలుగుతాయని పేర్కొన్నారు.

అలాగే మంటలు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాలకు వ్యాపించడం వల్ల ఇతర రైతుల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అదేవిధంగా పొలాల సమీపంలో ఉన్న ఇళ్లు,గడ్డి వాములు, విద్యుత్ స్తంభాలు మరియు ఇతర ఆస్తులకు కూడా మంటలు వ్యాపించి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. కొన్నిసార్లు రహదారులపై పొగ వ్యాపించడం వల్ల వాహనదారులకు దృష్టి సమస్యలు ఏర్పడి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు.

వరి కోయలను కాల్చడం వల్ల భూమిలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి భూసారం తగ్గిపోతుందని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు మరియు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరించి పంట అవశేషాలను కాల్చకుండా సహకరించాలని కోరారు. నిర్లక్ష్యంగా పంట అవశేషాలను కాల్చి ఇతరులకు నష్టం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.