31 May, 2026 | 6:23 PM

పీహెచ్ సీ మండల కేంద్రంలోనే ఉండాలి

31-05-2026 04:48 PM

- గ్రామ సర్పంచ్ మారం సునీత జలంధర్ రెడ్డి 

- రాష్ట్ర రహదారిపై ధర్నా నిర్వహించిన ఎండపల్లి గ్రామస్తులు

ధర్మపురి,(విజయక్రాంతి): గత ప్రభుత్వంలో మంజూరి అయిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం ఎండపల్లి మండల కేంద్రంలోనే నిర్మించేలా చర్యలు చేపట్టాలనీ గ్రామ సర్పంచ్ మారం సునీత జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు రాష్ట్ర రహదారి(కరీంనగర్ -మంచిర్యాల) పై ధర్నా నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మారం సునీత జలంధర్ రెడ్డి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి సరిపడా ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు ఉద్దేశ్య పూర్వకంగానే ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తరలిస్తూ రెండు గ్రామాల ప్రజల మధ్య భేదాభిప్రాయాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజానికి రాజారాంపల్లి గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ భూమి లేదనీ, దాతల సహకారంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి ఉద్దేశపూర్వకంగానే  స్థలాన్ని సేకరించారన్నారు. మండల కేంద్ర ఏర్పాటులో ఎండపల్లి గ్రామస్తుల కృషి మరువలేనిదని, గ్రామస్థుల కృషి ఫలితమే నేడు ఎండపల్లి మండలం ఏర్పాటైందనీ గుర్తు చేశారు. ఇప్పుడు మండల కేంద్రంలో నెలకొల్పాల్సిన ప్రభుత్వ భవనాలు ఇతర గ్రామాలు తరలించుకుపోతుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఎండపల్లి మండల కేంద్రంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనo నిర్మాణం చేపట్టాలనీ డిమాండ్ చేశారు.

ఎస్సై కి ఫిర్యాదు చేసిన సర్పంచ్

ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో తమ పేరును శిలాఫలకంలో నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎండపల్లి గ్రామ సర్పంచ్ మారం సునీత జలంధర్ రెడ్డి  ఎస్సై పులిచెర్ల ఉదయ్ కుమార్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.తమ పేరును ఇతర గ్రామస్తులు శిలాఫలకoపై లిఖించడాన్ని తీవ్రంగా ఖండించారు.

మా గ్రామం నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించడమే కాకుండా, ఆ గ్రామంతో ఎటువంటి సంబంధంలేని తమ పేరును శిలాఫలకంలో ముద్రించి, గ్రామ ప్రజలకు తమపై ఉన్న నమ్మకాన్ని, భరోసాను విస్మరించే ప్రయత్నాన్ని కొందరు పనిగట్టుకుని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి పూజ కార్యక్రమంలోని శిలాఫలకంపై తనపై ఉన్న తమ పేరును తొలగించి, మాయొక్క అనుమతి లేకుండా శిలాఫలకంపై నా పేరును లిఖించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.