calender_icon.png 10 February, 2026 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

10-02-2026 06:44:21 PM

ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నేపథ్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఇందులో భాగంగా పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. అక్కడ విధులలో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 1200 మందితో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.

నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిసరాలలో నిరంతర నిఘా కొరకు ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన పాల్వంచ అనుబోస్ కళాశాల పరిసర ప్రాంతాలను డాగ్స్ స్క్వాడ్, బాంబుస్క్వాడ్ తో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.