సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ
దమ్మపేట,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. గ్రామ మహిళలకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేసేందుకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు లు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంలో గ్రామస్తులు అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు.
ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు సిబ్బందికి అందించడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేయవచ్చని, పొడి చెత్తను రీసైక్లింగ్ కు పంపించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని వివరించారు. సెక్రటరీ బండి అనంత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఇంటిలో చెత్తను వేర్వేరుగా నిల్వ చేయడం అలవాటు చేసుకోవాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.






