రాయలాపూర్‌లో రైతులకు మట్టి పరీక్షా కిట్ల పంపిణీ
మట్టి ఆరోగ్య నిర్వహణపై అవగాహన కల్పించిన ఐసీఏఆర్ (ICAR-IIRR) శాస్త్రవేత్తలు
రూ.30 వేల విలువైన కిట్లు ఉచితంగా అందజేత
మేడ్చల్ అర్బన్ మే 02(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని రాయలాపూర్ పట్టణంలో భారత వరి పరిశోధనా సంస్థ (ICAR–IIRR) ఆధ్వర్యంలో మట్టి ఆరోగ్య నిర్వహణ (Soil Health Management) పై రైతులకు అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో నేలకొన్న స్వభావాన్ని సులభంగా తెలుసుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగింది.
ఈ సందర్భంగా భారత వరి పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసిన ప్రత్యేక మట్టి పరీక్ష కిట్‌ను రైతులకు పరిచయం చేశారు.భూమిలోని పోషక విలువల స్థాయిని కిట్ ద్వారా రైతులు స్వయంగా గుర్తించవచ్చని తద్వారా అనవసరపు ఎరువుల వాడకాన్ని తగ్గించి శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు.ప్రధాన శాస్త్రవేత్త డా బ్రజేంద్ర తన బృందంతో కలిసి మట్టి పరీక్ష కిట్‌ను ఎలా ఉపయోగించాలో రైతులకు ప్రాక్టికల్ డెమో ఇచ్చారు.
అదేవిధంగా మరో శాస్త్రవేత్త డా.కావిరాజు రైతులకు కలిగే సందేహాలను నివృత్తి చేస్తూ ప్రాయోగికంగా వివరించారు.ఈ సందర్భంగా సుమారు 30,000 వేల విలువ చేసే 30 మట్టి పరీక్ష కిట్లను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు.మేడ్చల్‌కు చెందిన అడ్వకేట్ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ సలహాదారు చీర్ల చంద్రశేఖర్ సహకారంతో రాయిలాపూర్ మాజీ సర్పంచ్ మెట్టు గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.ఆధునిక వ్యవసాయ పద్ధతుల పట్ల రైతులు ఆసక్తి చూపడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.






