ముంపు బాధితులకు రూ.8.33 కోట్ల పరిహారం
బండరావిపాకుల 125 మంది నిర్వాసితులకు చెక్కుల పంపిణీ
వనపర్తి, ఆగస్టు 27 ( విజయక్రాంతి ): నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(Tudi Megha Reddy) అన్నారు. ఎదుల రిజర్వాయర్‌లో భాగంగా బండరావిపాకుల ముంపు గ్రామానికి చెందిన 125 మంది లబ్ధిదారులకు రూ.8.33 కోట్ల పరిహారం చెక్కులను గురువారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(Adarsh Surabhi)తో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. బండరావిపాకుల, కొంకలపల్లి ముంపు నిర్వాసితుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.67 కోట్ల పరిహారం విడుదల చేసిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(Tudi Megha Reddy) తెలిపారు.
మొత్తం 175 మందికి పరిహారం అందాల్సి ఉండగా, బ్యాంకు ఖాతాల సమస్యలు, ఇతర కారణాలతో మిగిలిన వారికి త్వరలోనే అందజేస్తామని చెప్పారు. ఆర్‌అండ్‌ఆర్ గ్రామాల్లో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, మౌలిక వసతులు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ముంపు బాధితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, ముంపు బాధితులు పాల్గొన్నారు






