6న అఖిలపక్ష సమావేశం
ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుపై చర్చ
ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం
బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, జూలై 3(విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పాత పద్ధతిలోనే అమలు చేయాలని, ఫీజుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ప్రధాన డిమాండ్ తో గురువారం జరిగిన కాలేజీల బంద్ సంపూర్ణంగా విజయవంతమైందని కాలేజీలో బంద్‌తోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కనువిప్పు కావాలని, లేకపోతే ఈనెల 6న హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా అమలు చేయాలని గత ఆరు నెలలుగా శాంతియుతంగా ప్రజాసంఘంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న ప్రభుత్వంలో చలనం రావడం లేదని, ఇప్పటికే కలెక్టరేట్‌లో ముట్టడిలు, సచివాలయం ముట్టడి, నిరసన దీక్షలు చేపట్టిన ప్రభుత్వం వైపు నుంచి సానుకూల నిర్ణయం రావడంలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఈనెల 6 వ తేదీన జరిగే అఖిలపక్ష సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై విస్తృతంగా చర్చిస్తామన్నారు.
ప్రభుత్వం దిగివచ్చే వరకు ఈ రీయింబర్స్‌మెంట్ ఉద్యమాన్ని కొనసాగిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం జరిగిన కాలేజీల బంద్‌లో భాగంగా స్వచ్ఛందంగా ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ఇతర వృత్తివిద్య కాలేజీలు మూసేసి ఉద్యమానికి పూర్తిగా సహకరించారని,బంద్‌కు మద్దతు పలికిన అఖిలపక్ష విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలకు, మీడియాకు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






