11 July, 2026 | 1:18 AM

కరిగిన మంచు శివలింగం

11-07-2026 12:14 AM

అమర్‌నాథ్ యాత్రికుల నిరాశ

యాత్ర మొదలైన ఐదో రోజే కనుమరుగు  

వాతావరణ మార్పులే కారణం

ఆగని యాత్ర.. తరలివస్తున్న భక్తులు

శ్రీనగర్, జూలై 10: హిమాలయాల ఒడిలో వైభవంగా ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రికులకు నిరాశ ఎదురైంది.57 రోజుల పాటు భక్తులకు దర్శనమివ్వాల్సిన బాబా బర్పానీ మంచు శివలింగం.. యాత్ర మొదలైన ఐదు రోజులకే కరిగిపోయింది. ప్రతికూల వాతావరణం, ఉష్ణోగ్రతల్లో మా ర్పుల కారణంగా మంచు శివలింగం ఆకా రం పూర్తిగా కరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

అయితే, మంచు రూపం కరిగిన ప్పటికీ.. గుహలో భక్తులకు స్వామివారి దర్శ నం యథావిధిగా కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌లో గత ఏడాది పహల్గాం ఉగ్రదాడి అనంతరం భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నప్పటికీ అమర్‌నాథ్ యాత్రకు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. జూలై 3న ప్రారంభమైన ఈ యాత్రకు మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు 93,000 మందికి పైగా భక్తులు తరలివచ్చారు.

ఈ స్థాయిలో భక్తులు రావడం గడిచిన నాలుగేళ్లలో ఇదే తొలిసారి అని జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పేర్కొన్నారు. అయితే, ముందస్తు రిజిస్ట్రేషన్లు, హెల్త్ సర్టిఫికెట్లు లేకుండా వస్తున్న వేలాది మంది భక్తుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భద్రతా సిబ్బందికి, నిర్వాహకులకు ఇది పెద్ద సవాల్‌గా మారింది. అనుమతి లేని భక్తులు ఓపిక పట్టాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కోరారు. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రోజుకు పహల్గామ్, బాల్తాల్ మార్గాల ద్వారా కేవలం 10,000 మందికి మాత్రమే అనుమతి ఉంది. 

కారణాలు?

అమర్‌నాథ్ గుహ సముద్ర మట్టానికి సుమారు 3,888 మీటర్ల ఎత్తులో ఉంది. గుహ పైకప్పు నుంచి పడే నీటి చుక్కలు గడ్డకట్టడం వల్ల ఈ మంచు లింగం సహజ సి ద్ధంగా ఏర్పడుతుంది. మంచు లింగం ఉనికి సాధారణంగా అక్కడి ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. గతంలో 2004, 2006, 2016, 2020, 2024లలో కూడా మంచులింగం గడువు కంటే ముందే కరిగిపోయిన దాఖలాలు ఉన్నాయి.

అయితే ఈసారి మరీ వేగంగా కరిగిపోవడానికి గ్లోబల్ వార్మింగ్ (వాతావరణ మార్పులు) ప్రధాన కారణమని శావేత్తలు అంటున్నారు. దీనికి తోడు గుహ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న మానవ సంచా రం, భారీ మౌలిక సదుపాయాల విస్తరణ (రోడ్ల వెడల్పు, విద్యుద్దీకరణ, ప్రతిపాదిత రోప్‌వే ప్రాజెక్ట్ మరియు రెయిన్ షెల్టర్ల నిర్మాణం) వల్ల గుహ లోపల ఉండే సూక్ష్మ వాతావరణం మారిపోతోందనే విమర్శలు వస్తున్నాయి. 

శాస్త్రీయ పరిశోధన అవసరం    

మంచు లింగం వేగంగా కరిగిపోవడంపై పీడీపీ నాయకురాలు ఇల్తిజా ముఫ్తీతో పాటు పలువురు ప్రముఖులు, కాంగ్రెస్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిత్రాలను ముఫ్తీ సాజాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. యాత్ర నిర్వహణ తీరుపై ఆమె ప్రశ్నలు గుపించారు. దీనిపై శాస్త్రీయ పరిశోధన జరపాలని, గుహ సమీపంలో నిర్మించిన వర్షపు షెల్టర్ల ప్రభావంపై అధ్యయనం చేయించాలని  డిమాండ్ చేశారు.