30 May, 2026 | 3:49 AM

దర్గాలో దగా.. దళారులదే హవా..!

30-05-2026 12:43 AM
  1. జాన్ పహాడ్ దర్గాలో భక్తుల నిలువు దోపిడీ
  2. ప్రశ్నించిన వారిపై దాడులు
  3. మొక్కులు చెలించాలంటే రూ.1600 డిమాండ్ 
  4. హలాల్ చేస్తే యాటకు రూ.750, కోడికి రూ.500 వసూళ్లు. 
  5. హుండీలో డబ్బులు వేస్తేనే లోపలికి అనుమతి 
  6. అక్రమ వసూళ్లకు భక్తుల బెంబేలు 
  7. ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని విన్నవించుకుంటున్న భక్తులు

పాలకవీడు, మే 29: మండలంలోని ప్రసిద్ధ జాన్ పహాడ్ దర్గాలో అక్రమ వసూళ్ల దందా రోజురోజుకు పెరిగిపోతుందని అక్కడికి వచ్చే భక్తులు ఆరోపిస్తున్నారు. దర్గాలో పనిచేస్తున్న సిబ్బంది అక్కడికి వచ్చే భక్తులను బెదిరిస్తూ అక్రమ అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైసలు ఇస్తేనే దర్శనం అంటూ భక్తులను బలవంతపెడుతున్నారని చెబుతున్నారు. దీనిపై ప్రశ్నించిన గ్రామస్తులను బెదిరింపులకు గురిచేస్తున్నారని సమాచారం. దర్గాలో వివిధ సేవల పేరుతో అధి కారిక ఉత్తర్వులు లేకుండానే టికెట్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. మొత్తానికి దర్గా వద్ద దగా.. దళారులదే హవా అన్నచందంగా పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.

దందాల మయంగా దర్గా :

వందల సంవత్సరాల చరిత్ర గల జాన్ పహాడ్ దర్గా , కోరిన కోరికలు తీర్చే దైవంగా పేరుగాంచింది. సైదన్న గా పేరున్న దర్గాలో నేడు అడుగడుగున దందాల మయంగా మారింధని స్థానికంగా బాగా వినిపిస్తుంది. ఎంతో నమ్మకంతో వచ్చే భక్తులను నిలువు దోపిడీ చేస్తుండడంతో భక్తులు నిరాశ చెందుతున్నట్లు వినికిడి. అడుగడుగున అక్రమ వ సూళ్లు చేస్తూ సైదన్న దర్శనం డబ్బులతో ముడిపెడుతూ నిరుపేదలకు భారంగా మార్చుతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. 

దళారుల చేతుల్లో దర్గా దర్శనం: 

జాన్ పహాడ్ దర్గా ప్రాంతంలో కొంత మంది కాంట్రాక్టుదారులు అధిక మొత్తంలో కాంట్రాక్టులు తీసుకుని, భక్తులు, సాధారణ ప్రజల నుండి అన్యాయంగా అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంట్రాక్టు పేరుతో భక్తులపై అధిక రేట్లు వసూలు చేస్తూ దర్శనానికి గంపెడు ఆశతో వచ్చే భక్తుల మనస్సుపై అధిక ధరల ఆందోళనను రుద్దుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

అక్రమ వసూళ్లతో భక్తుల బెంబేలు 

దర్గా వద్ద ఊహించని రెట్లు పెట్టీ భక్తుల వద్ద నుండి బలవంతపు వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. మొక్కుల చెల్లింపుల వద్ద అధిక వసూళ్లు దీనికి మరింత బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి.మేకపోతు హలాల్ చేయాలంటే రూ. 750, కోడి కైతే రూ.500 చెలిస్తేనే అక్కడ హలాల్ చేస్తుండడం గమనార్హం. ఇక దర్గా లోపల మొక్కులు చెల్లించాలంటే రూ. 1600 ఇవ్వాల్సిందేనట. బైక్ పూజ కి 500, కారు పూజకి 2000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారనీ భక్తులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం రోజు భక్తులు ఇదేమిటి, ఇంత రేటు అన్ని ప్రశ్నిస్తే వారిపై ప్రెవేట్ వ్యక్తులతో దాడి చేయిస్తున్నారనీ భక్తులే చెబుతున్నారు. దర్గా దర్శనానికి లోపలకి పోవాలన్నా ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారనీ దర్శనానికి వెళ్లేవారు చెబుతున్నారు. ఇంత జరుగుతున్న వక్ఫ్ బోర్డ్ అధికారులు ఏం తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. 

లోకల్ నాయకుల అండతో మూడు పువ్వులు ఆరు కాయలుగా దందా

దర్గాకు కాంట్రాక్టర్లు ఎవ్వరు వచ్చిన లోకల్ నాయకుల అండతో మూడు పువ్వులు ఆరు కాయలుగా దందా చేస్తున్నారని స్థానికుల ఆరోపిస్తున్నారు. వారి అండ ఉంటేనే దందా సాఫీగా సాగుతుందని వారి సహకారం తీసుకుంటున్నట్లు స్థానికంగా వినిపిస్తుంది. దర్గా కాంట్రాక్టర్లు, ప్రైవేట్ వ్యక్తులకు సహకరిస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అక్రమ వసూళ్లపై ప్రశ్నించినందుకే జాన్ పహాడ్ దర్గా ఉప సర్పంచ్ నాగరాజుపై అందరూ వ్యక్తులు దాడి చేసినట్లు ఆయనే చెప్పాడు. అయితే దాడి గురించి వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అలీను వివరణ అడగగా దాడి జరిగిన విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి దర్గాలో జరుగుతున్న అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

దర్గాలో జరిగే అక్రమ వసూళ్లను అరికట్టాలి 

జానపహాడ్ దర్గాలో భక్తులకు జరుగుతున్న అన్యాయన్నీ, అక్రమ వసూళ్ళు చేస్తున్న వారిని ప్రశ్నిస్తే నాపై దాడి చేసినారు. కొందరు స్థానిక నాయకులతో కలిసి కాంట్రాక్టర్ లు జానప హాడ్ దర్గాలో దందా నిర్వహిస్తున్నారు. దర్గాకు వచ్చే భక్తులనుండి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉన్నత అధికారులు, వక్ఫ్ బోర్డ్ అధికారులు అధిక వసూళ్లకి పలుపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి.

 నాగరాజు, ఉప సర్పంచ్, జాన్ పహాడ్ దర్గా