ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేత
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల వాసి, నల్లగొండ జిల్లా తెలంగాణ సాహితి ఉపాధ్యక్షుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల నాగార్జునసాగర్ అధ్యాపకుడు దాసరి శ్రీరాములు తన తల్లిదండ్రుల పేరుతో స్థాపించిన "దాసరి సత్తమ్మ-సాయిలు విద్యా, సాహిత్య సహకార సంస్థ" ఆధ్వర్యంలో నేరడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రూ.6,100 నగదు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్య సమాజాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసే శక్తి అని, గణితశాస్త్రం తార్కిక ఆలోచనలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు సుశీల మాట్లాడుతూ, పేద కుటుంబం నుంచి వచ్చిన దాసరి శ్రీరాములు నేడు విద్యార్థులను ప్రోత్సహించే స్థాయికి ఎదగడం ఆదర్శనీయమని అన్నారు. నగదు బహుమతులు పొందిన వారిలో జి. సంకీర్తన, ఎం.డి. షాహిన్, బి. పూజ, ఎస్.కె. యాస్మిన్, పి. శిరీష ఉన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించగా, దాత దాసరి శ్రీరాములు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






