17-02-2026 01:43:05 AM
ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా అభివద్ధి
కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌తో మారుమూల ప్రాంతాలకు వైద్యం
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): అంతర్జాతీయ ప్రమాణాలతో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా భారత్ ఫ్యూచర్‌లో సిటీలో ప్రత్యేకంగా ‘హెల్త్ సిటీ’ని అభివద్ధి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సాయంతో మారుమూల ప్రాంతాలకూ వైద్య సౌకర్యాలను చేర్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సోమవారం టీ హబ్‌లో ‘టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీఏఎల్ హాస్పిటల్స్ హెల్త్ ఫెస్ట్ 2026’ ఫైర్ సైడ్ చాట్‌లో మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
రాష్ర్టంలో ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైలింగ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. మహిళలందరికీ ముందస్తు క్యాన్సర్ నిర్ధారిత పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ర్టంలోని ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలను మార్చేందుకు చిత్తశుద్ధితో కషి చేస్తున్నామని తెలిపారు. అక్కడికొచ్చే రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందేలా టెక్నాలజీ వినియోగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్‌గా తెలంగాణను మార్చాలనే సంకల్పంతో ప్రత్యేక పాలసీని తీసుకొ చ్చామన్నారు.
హెల్త్ కేర్ రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ ఆర్‌అండ్ డీకి పెద్దపీట వేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత ‘తెలంగాణ డిజిటల్ ఎక్స్ఛేంజ్’ను ప్రారంభించామన్నారు. నేటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’ను తయారు చేసే బృహత్తర బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. మరో మూడు నుంచి నాలుగు నెలల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్‌ను లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు.
హైదరాబాద్‌కు ధీటుగా రాష్ర్టంలోని టైర్2, టైర్3 నగరాలను కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. వరంగల్, ఆదిలాబాద్‌లో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. హెల్త్ కేర్ రంగంలో టెక్నాలజీ మిళితం చేసి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టే ఆవిష్కర్తలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తోందని, తమతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని వారిని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో నిర్వాహకులు సాయి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.