అంకెల గారడీ.. కాదు కాదు సంక్షేమ బడ్జెట్
కరీంనగర్, మార్చి20(విజయక్రాంతి): తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి వి క్రమార్క అసెంబ్లీలో 2026-27 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం విలువ రూ.3,24,234 కోట్లుగారెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుగా, మూలధన వ్య యం రూ.47,267 కోట్లు, తలసరి ఆదా యం రూ.4,18,931 కోట్లు. రాష్ట్ర వృద్ధి రేటు 10.2 శాతమని భట్టి ప్రకటించారు.
బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు 26,674 కో ట్లు, వ్యవసాయ శాఖకు 23,179 కోట్లు, వి ద్యుత్ శాఖకు 21,285 కోట్లు, పౌరసరఫరా ల శాఖకు 7,366 కోట్లు, పశుసంవర్ధక శా ఖకు 1,529 కోట్లు, వైద్య శాఖకు 13,679 కో ట్లు, కార్మిక శాఖకు 998 కోట్లు, పర్యాటక రంగానికి 1,224 కోట్లు, మహిళా శిశు సం క్షేమ శాఖకు 3,143 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7,937 కోట్లు, బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.3,769 కోట్ల చొప్పున కేటాయించారు.
అదేవిధంగా పట్టణాభివృద్ధి, పురపాలక శాఖకు రూ.17, 907 కోట్లు, న్యాయశాఖకు రూ.2,367 కోట్లు, రవాణా శాఖకు రూ.12,759 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ.33,688 కోట్లు, ఐటీ శాఖకు రూ.875 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.3,490 కోట్లు, చేనేతకు రూ.258 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.7,430 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు రూ.22,615 కోట్లు, రాజీవ్ యువ వికాసానికి రూ.6 వేల కోట్లు, శాంతిభద్రతలకు రూ.11,907 కోట్లు, గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్ల చొప్పున కేటాయించారు. ఇది అంకెల గారడిగా ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే సంక్షేమ బడ్జెట్ గా కాంగ్రెస్ నేతలంటున్నారు. బి సి సంక్షేమం, విద్యారంగం పై చిన్నచూపు అంటున్నారు యువ నాయకులు.
బల్దియాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న చూపు: బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్, కార్పొరేటర్ బి. ప్రవీణ్ రావు
బల్దియాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల కేటాయింపు విషయంలో చిన్న చూపును చూసింది. దీంతో అభివృద్ధి, సంక్షేమపథకాల అమలు విషయంలో పట్టణ ప్రజలకు తీరని అన్యాయం జరగనుంది. నిండు అసెంబ్లీ సాక్షిగా.. అబద్దాల అంకెలతో కూడిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేటాయింపులు కు వాస్తవ పరిస్థితికి పొంతన లేకుండా అత్తెసరు నిధులను ఆయా శాఖలకు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మాటలకు చేతలకు పొంతన లేనివిధంగా నిధుల ప్రస్తావనను ఆర్థిక మంత్రి వినిపించారు. నేత కార్మికులకు ఈసారి తక్కువ బడ్జెట్ కేటాయించడం వల్ల సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలోని చేనేత కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుంది.
ప్రాధాన్యతా రంగాలకు పెద్ద పీట :మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ప్రాధాన్యతా రంగాలకు పెద్దపీట వేశారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయం, విద్య, విద్యుత్, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించారు. విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రంగం అభివృద్ధి కోసం 26,674 కోట్లు కేటాయించడం సహేతుకం. రైతుల సంక్షేమం, వ్యవసాయరంగం అభివృద్ధి కోసం 23,179 కోట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలించింది.
కీలకమైన విద్యుత్ శాఖకు 21,285 కోట్లు కేటాయించడం శుభ పరిణామం. పేర్కొన్నారు.బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,934 కోట్లు , మైనార్టీ సంక్షేమానికి 3,769 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉదాతరతను చాటుకున్నదని. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించారు. అందుకే ఈ బడ్జెట్ సబ్బండవర్ణాల సంక్షేమ బడ్జెట్.
విద్యారంగాన్ని విస్మరించిన రాష్ట్ర బడ్జెట్: ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 3,24,234లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా విద్యారంగానికి కేవలం 26,674 కోట్లు మాత్రమే కేటాయించారు. 8.23%నిధులు మాత్రమే విద్యకు కేటాయించింది. గత బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి కేవలం 1.18%నిధులు కేవలం అంటే 3566కోట్లు మాత్రమే పెంచారు. ఇవి ఏ మేరకు విద్యారంగ అభివృద్ధికి సరిపోవు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో విద్యకు 15%నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని కానీ మూడవ బడ్జెట్ కేటాయింపులో కూడా ఆ హామీ మేరకు అయిన నిధులు కేటాయించకుండా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారు.
నిరాశాజనకంగా ఉంది:యాదగిరి సునీల్ రావు
రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్
తెలంగాణ ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బహుశా పొరపాటున గత ఏడాది బడ్జెట్ నే చదివారేమో అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే పోయినసారి బడ్జెట్ కన్నా ఇందులో పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేవు.ఐదు దఫాలుగా రైతు భరోసా ఇవ్వాల్సి ఉండగా, సరిగ్గా ఇవ్వకుండా.. ఇంకా ప్రతి రైతుకు ఇంకా సుమారు ఎకరాకు రూ. 45,000 కి పైగా బాకీ పడి ఎగ్గొట్టారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ. 4000 నిరుద్యోగ భృతి కానీ, మహిళలకు ఇస్తామన్న రూ. 2500 ఆర్థిక సాయం గురించి కానీ ఈ బడ్జెట్లో ఎక్కడా కనిపించడం లేదు.ఇది మోసం& దగా& ప్రజా వంచనతో నిండిపోయిన బడ్జెట్. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు.
బడ్జెట్ లో బీసీలకు మొండి చెయ్యి :నర్సింగోజు శ్రీనివాస్:బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా బీసీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. 12511 కోట్లతో చేతులుదులుపుకుంది. అధికారంలోకి రాక ముందు ప్రతి సంవత్సరం బీసీల సంక్షేమానికి 20వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయింది.
అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ : సుడాచైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ క్రైం, మార్చి20(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జె ట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని అ న్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలకు,ఆరు గ్యారంటీలకు అధిక నిధులు కేటాయించడం ఇందిర మ్మ ఇండ్లకు పెద్దపీట వేయడం హర్షదాయకం అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజా రవాణాకు ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం 2 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని నరేందర్ రెడ్డి అన్నారు.మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు మరింత అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన చేశారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అభినందనలు తెలిపే సమయమిది అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
బడ్జెట్ పూర్తిగా మోసపూరితంగా ఉంది: బిఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హారి శంకర్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా మోసపూరితంగా ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ నిధుల కేటాయింపులో వివక్ష చూపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో ఆరు గ్యారం టీలో ఊసే లేదు. మూడు లక్షల ఇరవై నా లుగు కోట్ల రెండు వందల ముప్పు నాలుగు కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఇది పూర్తిగా అంకెల గారడి మాత్రమే.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ బీసీల సంక్షేమానికి ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు కేవలం 12 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టి బీసీలను నయవంచనకు గురిచేసింది. తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేసే బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.




