calender_icon.png 18 January, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షీణించిన ఫారెక్స్ నిల్వలు

18-01-2025 01:41:49 AM

మరో 8.7 బిలియన్ డాలర్ల తగ్గుదల

ముంబై, జనవరి 17:  విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ నుంచి పెట్టుబడులు తరలించడం, దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంక్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి.  శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం  జనవరి 10తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు మరో 8.714 బిలియన్ డాలర్లు తగ్గి 625.871 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.

ఫారెక్స్  నిల్వలు సెప్టెంబర్ చివరినాటి రికార్డు గరిష్ఠస్థాయి 704.885 బిలియన్ డాలర్ల  నుంచి ఇప్పటివరకూ 78 బిలియన్ డాలర్లు క్షీణిం చాయి. అంతక్రితం జనవరి 3తో ముగిసిన ఒక్కవారంలోనే 5 బిలియన్ డాలర్లుపైగా తరిగిపోయాయి. గత కొద్దివారాలుగా రూపాయి పతనాన్ని నిరోధించడానికి రిజర్వ్‌బ్యాంక్ విరివిగా డాలర్లను విక్రయించడం కూడా నిల్వల తగ్గుదలకు కారణమని విశ్లేషకులు చెప్పారు.

తాజాగా జనవరి 3తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 9.469 బిలియన్ డాలర్లు క్షీణించి 536.011 బిలియన్ డాలర్ల స్థాయికి తగ్గాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

పెరిగిన బంగారం నిల్వలు 

ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు మాత్రం సమీక్షావారంలో 792 మిలియన్ డాలర్లు పెరిగి 67.883 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 33 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 17.781  బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్లు రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు 4 మిలియన్ డాలర్లు క్షీణించి 4.196 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.