భూపాలపల్లి మున్సిపాలిటీ స్తంభిస్తుంది: మాజీ ఎమ్మెల్యే గండ్ర
పాత పద్ధతిలోనే పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 14 (విజయక్రాంతి): మున్సిపల్ కార్మికుల వేతనాలు తగ్గిస్తే భూపాలపల్లి మున్సిపాలిటీ స్థంభిస్తుందని భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి మున్సిపాలిటీలో పని చేస్తున్న 152 మంది కార్మికుల వేతనాలను తగ్గించే చర్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ జీవో నెం 69 ప్రకారం వేతనాలు తగ్గించాలని హైదరాబాద్ నుంచి ఆదేశాలు వచ్చాయని అయితే కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 152 మంది కార్మికులకు ఎలాంటి కోతలు లేకుండా పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారని పేర్కొన్నారు.
సమావేశంలో తీర్మానం చేసినప్పటికి ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయాల్సిందేనని మున్సిపల్ కమిషనర్ చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం ఒక్కో కార్మికుడి వేతనం నుండి సుమారు రూ.1,000 నుంచి రూ.4,900 వరకు కోత పడే పరిస్థితి ఉందని, ఇది కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ బిల్లులు, ఇంటి ఖర్చులు పెరుగుతున్న సమయంలో వేతనాలు పెంచాల్సింది పోయి తగ్గించడం సరియైన పద్ధతి కాదు అని అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానానికి ర్యాటిఫికేషన్ తీసుకుని 152 మంది కార్మికులకు పాత పద్ధతిలోనే పూర్తి వేతనాలు చెల్లించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే భూపాలపల్లి మున్సిపాలిటీని స్తంభింపజేసే విధంగా కార్యక్రమాలను ఉదృత్తం చేస్తామని హెచ్చరించారు.






