14 August, 2026 | 3:12 PM

టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర మహిళా సదస్సును విజయవంతం చేయాలి

14-08-2026 02:01 PM

జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతి కుమారి

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 16న నిర్వహించనున్న టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర మహిళా సదస్సుకు అన్ని యాజమాన్యాల మహిళా ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతి కుమారి కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సమానత్వం, మహిళా సాధికారత లక్ష్యంగా రాష్ట్ర మహిళా సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు కేవలం నాయకత్వ స్థానాల్లో నామమాత్రంగా కాకుండా సామాజిక స్పృహతో సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తాలని పిలుపునిచ్చారు.

సంఘ నిర్మాణంతో పాటు సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పోరాటాల్లో మహిళా ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో చురుకైన నాయకత్వాన్ని చేపట్టేలా టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకత్వం సదస్సులు, శిక్షణ తరగతుల ద్వారా వారిని ప్రోత్సహిస్తోందన్నారు.జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రీతి మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయులు, బాలికలు పాఠశాలల్లో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారిని చైతన్యవంతం చేయడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలపై విస్తృత చర్చకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని అన్నారు. జిల్లా నుంచి మహిళా ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు.