అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
కుషాయిగూడ, ఏప్రిల్ 4 (విజయక్రాంతి) : మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లిలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య జెసిబిల సహాయంతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన నిర్మాణదారునికి గతంలో మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన వాటిని పట్టించుకోకుండా పనులు కొనసాగించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ముందుగా భవనాన్ని సీజ్ చేసినప్పటికీ, మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతో అధి కారులు కఠినంగా స్పందించారు.
టౌన్ ప్లానింగ్ ఏసిపి కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, జీ ప్లస్ టూ అనుమతులు తీసుకుని అదనపు అంతస్తులు నిర్మించడంపై ఫిర్యాదులు రావడంతో భవనాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ సీజ్ చేసిన భవనంలో మళ్లీ నిర్మాణాలు కొనసాగించడంతో నిర్మాణదారునిపై చర్లపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగి స్తూ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.




