బ్రతికుండగానే చనిపోయినట్లు చూపి భూకబ్జా
కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష
పాలకుర్తి తహసీల్దార్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్
అక్రమ రిజిస్ట్రేషన్‌పై ఏసీబీ విచారణ జరపాలి
తెలంగాణ రాజ్యాధికార పార్టీ
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
పెద్దపల్లి,(విజయక్రాంతి): బ్రతికున్న గిరిజన మహిళను చనిపోయినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆమె భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ అక్రమాలకు పాల్పడిన పాలకుర్తి తహసీల్దార్‌పై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్ మాట్లాడుతూ... పాలకుర్తి మండలం భీమ్లనాయక్ తండాకు చెందిన గిరిజన మహిళ ఇస్లావత్ సుజాత (37) బ్రతికి ఉండగానే, ఆమె 2006లోనే మరణించినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించారని మండిపడ్డారు. సర్వే నెం. 111 లోని 24 గుంటల భూమిని అక్రమంగా కబ్జా చేయడానికి 37 ఏళ్ల మహిళకు 56 ఏళ్ల వ్యక్తిని మనవడిగా చూపించి రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. బాధితురాలి వద్ద ఆధార్ కార్డు, డిజిటల్ పాస్‌బుక్ వంటి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అక్రమంగా పట్టా మార్పిడి చేయడం దారుణమని, దీని వెనుక ఉన్న రెవెన్యూ అధికారుల పాత్రపై ఏసీబీ విచారణ జరిపించాలని కోరారు.
అనంతరం అక్రమ రిజిస్ట్రేషన్‌ను వెంటనే రద్దు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నంపుల్లి శివదాస్, ఉపాధ్యక్షులు మేరుగు సతీష్ గౌడ్, జాయింట్ సెక్రటరీ కాంపెల్లి స్వామి, కార్యదర్శి కుమ్మరి పరమేశ్, ధర్మారం మండల ఉపాధ్యక్షులు నేరువట్ల నరేష్, నాయకులు బాబు, రంగు నాగరాజు, మెరుగు జయ మరియు బాధితురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






