19 May, 2026 | 2:39 AM

అనుమానాస్పదంగా జింక మృతి

19-05-2026 01:27 AM
  1. గతంలోనూ వేటగాళ్లను పట్టుకుని కేసులు నమోదు
  2. అధికారుల పర్యవేక్షణ కొరవడటమే కారణమని స్థానికుల ఆరోపణ

నాగల్గిద్ద, మే 2:  నాగల్గిద్ద మండలం శికర్ ఖానా గ్రామ శివారులో సోమవారం ఓ జింక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు గుర్తించి వెంటనే పోలీస్, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న నాగల్గిద్ద ఎస్త్స్ర కాశీపురం రామకృష్ణ, సీఐ శ్రీనివాస్రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దిగంబర్ సంఘటనా స్థలానికి చేరుకుని జింక మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు జింక కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగల్గిద్ద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రాంతంలో గతంలో కూడా జింక వేటగాళ్లను పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మళ్లీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వేటగాళ్లు యథేచ్ఛగా జింకలను వేటాడుతున్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని ఎఫ్‌ఆర్‌ఓ దిగంబర్ తెలిపారు. వేటగాళ్లపై నిరంతర నిఘా పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.