రామాయంపేటలో కొత్త పోలింగ్ బూత్‌లకు బీజేపీ డిమాండ్
ఎమ్మార్వోకు వినతిపత్రం
రామాయంపేట,(విజయక్రాంతి): రామాయంపేట పట్టణం, మండలంలో ఓటర్ల సంఖ్య పెరగడంతో పోలింగ్ కేంద్రాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోందని పేర్కొంటూ, ప్రజలకు సౌకర్యవంతమైన ఓటింగ్ వాతావరణం కల్పించేందుకు వెంటనే కొత్త పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు బీజేపీ నాయకులు బుధవారం రామాయంపేట ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. రామాయంపేట పట్టణం మరియు మండలంలో ఇటీవల నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో వెలుగులోకి వచ్చిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, అధిక ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను రేషనలైజేషన్ చేసి కొత్త పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని బూత్ నంబర్లు 76, 77లో ఒక్కో కేంద్రానికి సుమారు 1,300 మంది ఓటర్లు ఉండటంతో ప్రతి ఎన్నికల సమయంలో తీవ్ర రద్దీ నెలకొంటోందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తగిన వసతులు లేకపోవడం, ఓటింగ్ పూర్తవడానికి ఎక్కువ సమయం పట్టడం వల్ల ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రెండు బూత్‌లను రేషనలైజేషన్ చేసి అదనపు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని కోరారు.
అదేవిధంగా రామాయంపేట మండలంలోని వెంకటాపూర్ (ఆర్) గ్రామంలో ప్రస్తుతం బూత్ నంబర్ 115 ఒక్కటే ఉండటంతో గ్రామ ప్రజలందరూ ఒకే కేంద్రంలో ఓటు వేయాల్సి వస్తోందని తెలిపారు. దీంతో ప్రతి ఎన్నికల్లో భారీ రద్దీ ఏర్పడి ఓటర్లు అసౌకర్యానికి గురవుతున్నారని, వెంటనే మరో కొత్త పోలింగ్ బూత్‌ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రామాయంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, మండల ప్రధాన కార్యదర్శి దిలీప్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు రామాయంపేట ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.
ప్రజలకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు అవసరమైన చోట కొత్త పోలింగ్ బూత్‌ల ఏర్పాటు అత్యవసరమని, ఎన్నికల సంఘం ఈ అంశంపై తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్ గౌడ్, అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి, దంతపల్లి సర్పంచ్ బాలరాజ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు నవత్ రాజేంద్రప్రసాద్, రామాయంపేట మండల ప్రభారి రంజిత్ రెడ్డి, పట్టణ ప్రభారి గడ్డం కాశీనాథ్, అక్కన్నపేట మాజీ సర్పంచ్ వెలుముల సిద్ధరాములు, పట్టణ సీనియర్ నాయకులు రమణ, బీజేవైఎం మండల అధ్యక్షులు కన్నయ్య, నాయకులు నాగరాజు, వెంకటి, నితిన్, సంతోష్, బాసం అనిల్ తదితరులు పాల్గొన్నారు.






