21-02-2026 12:00:00 AM
తరచూ వాయిదాల పర్వం
హస్తం నేతల్లో తీవ్ర నైరాశ్యం
ఇప్పటికే అధిష్టానానికి జాబితా
ఈసారైనా పదవులు వచ్చేనా?
సంగారెడ్డి, ఫిబ్రవరి 20(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియడమే కాకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడంతో పార్టీ వర్గీయుల్లో జోరు నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీలో మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీ అంశం చర్చకు వచ్చింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఢిల్లీలో హైకమాండ్ కు దీనిపై సీరియస్ గా సిఫారసు చేశారని, ఏఐసీసీ ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశ ముందనే ప్రచారం జరుగుతున్నందున మరోసారి ఈ చర్చ మొదలైంది.
ఉగాదిలోపే పదవులు భర్తీ చేయాలని మీనాక్షి నటరాజన్ కోరిన నేపథ్యంలో ఆశావహుల్లో మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రతీసారి ఇలాగే చర్చకు రావడం, మళ్లీ వాయిదా పడడం పరిపాటిగా మారింది. దీంతో ఈసారైనా పదవులు భర్తీ చేస్తారా.. లేదా అనే అసహనం పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉంది. పార్టీ పదవులూ భర్తీ చేయకపోవడంతో వాటి విషయంలోనూ నిరీక్షణే నెలకొంది.
అవకాశం కల్పిస్తారా ?
ఉమ్మడి మెదక్ జిల్లాలో పది నియోజకవర్గాల్లో కేవలం మూడు నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రాతినిద్యం వహిస్తోంది. మిగతా ఏడు స్థానాల్లో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో సైతం జహీరాబాద్ కాంగ్రెస్, మెదక్ బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో మాత్రం మెజార్టీ ప్రాతినిధ్యం లేక జిల్లా అనేక అంశాల్లో వెనుకబడిపోతోందన్న ఆవేదన హస్తం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో నామినేట్ పదవుల్లో అవకాశం దక్కలేదు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఇప్పటికైనా నామినేటెడ్ తో పాటు పార్టీ పోస్టులు భర్తీ చేసి జిల్లాలో కాంగ్రెస్ అభివృద్ధికి తోడ్పాటునందించాలన్న అభిప్రాయం హస్తం నేతల్లో వ్యక్తమవుతోంది.
ఇప్పటికే జాబితా అందజేత..
నామినేటెడ్ పదవులకు సంబంధించి ఉమ్మడి జిల్లా నుంచి పలువురి పేర్లతో డీసీసీ నుంచి టీపీసీసీకి ఇదివరకే జాబితా వెళ్లినట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు కావాలని పలువురు కోరుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, దేవాదాయ శాఖ చైర్మన్ పదవులతో పాటు పలు పదవులను భర్తీ చేయాల్సిన అవసరముంది. సర్పంచ్ ఎన్నికల కంటే ముందు జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులను పార్టీ నియమించింది.
జిల్లా కమిటీలో ఇతర పదవులను భర్తీ చేయలేదు. మండల, పట్టణ కమిటీలు వేయలేదు. వీటికి సంబంధించి సమావేశాలు నిర్వహించి పలువురి పేర్ల ను సేకరించి అధిష్టానానికి పంపించారు. ఇక అప్పుడు, ఇప్పుడు నియామకమంటూ దాటవేస్తూ వస్తున్నారు. ఇలా ఆలస్యమవుతుండటంతో పార్టీ కార్య కర్తల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఇకనైనా పదవులు భర్తీ చేయాలని వారు కోరుతున్నారు.