గోపాల గోపి మృతి సీపీఐ, ఏఐటీయూసీకి తీరని లోటు
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 20 (విజయక్రాంతి): భూపాలపల్లి కేటికే 1వ ఇంక్లైన్ గనిలో బుధవారం అర్ధరాత్రి సమయంలో విధులు నిర్వహిస్తుండగా గోపాల గోపి గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన మృతి సీపీఐ, ఏఐటీయూసీకి తీరని లోటని సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ అన్నారు. కామ్రేడ్ గోపి సీపీఐ శాఖ కార్యదర్శిగా, సింగరేణి ఏఐటీయూసి నాయకులుగా అనేక కార్యక్రమాలను ముందుండి నడిపి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి అని కొనియాడారు. ఈ సందర్భంగా వారి పార్థివదేహానికి ఎర్రజెండా కప్పి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో చనిపోయిన గోపికి సింగరేణి యాజమాన్యం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసి నాయకులు పాల్గొన్నారు.






