భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి
పెద్దపల్లి,(విజయ క్రాంతి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన బుధవారం పరిశీలించారు. మల్కాపూర్, మెడికల్ కళాశాల, 5 ఇంక్లైన్ తదితర ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లి రహదారులపైకి నీరు చేరిన ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్, మేయర్ మహంకాళి స్వామి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, నదుల్లో వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున ప్రజలు వాటి వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా గోదావరి, మానేరు నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు యువత వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
వర్షాల కారణంగా రహదారులు జారుడుగా మారే అవకాశం ఉన్నందున వాహనదారులు పరిమిత వేగంతోనే ప్రయాణించాలని సూచించారు. అలాగే సెల్ఫీలు తీసుకోవడం, ఈతకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అత్యవసరా పరిస్థితుల్లో డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని డీసీపీ బి. రామ్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






