మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ
– పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్ష
– ఆన్‌లైన్ నమోదుపై ప్రత్యేక దృష్టి
– ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నిస్పాక్షికంగా సేవలు అందించాలి – జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్.
భూపాలపల్లి/కాళేశ్వరం,(విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ వార్షిక తనిఖీల్లో భాగంగా మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటడం జరిగింది. అనంతరం పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.
రోడ్డు ప్రమాద కేసులకు సంబంధించిన వాహనాల స్థితిగతులు, వాటి పరిష్కార పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.రిసెప్షన్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అందిన ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
అదేవిధంగా స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ, కేసు రికార్డుల నవీకరణ విధానాన్ని పరిశీలించి, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ నిర్వహించాలని ఆదేశించారు. రౌడీ షీటర్లపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించి, వారిపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి పౌరుడికి స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలని అధికారులు, సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ వార్షిక తనిఖీలలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహాదేవ్‌పూర్ సీఐ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.






