29 July, 2026 | 5:47 PM

Breaking News

కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆలేటి ఆనందరావు నియామకం

29-07-2026 05:24 PM

ఇల్లందు టౌన్, (విజయక్రాంతి): ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన జిల్లా ఎస్సీ సెల్ కమిటీలో ఇల్లందు పట్టణం 22వ వార్డుకు చెందిన ఆలేటి ఆనందరావు (చిన్ని)ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ గద్దల రమేష్ ఆధ్వర్యంలో ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలేటి ఆనందరావు (చిన్ని) మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్‌కు, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడంతో పాటు జిల్లాలోని ఎస్సీ సెల్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాజిక న్యాయం, సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ నియామకంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆలేటి ఆనందరావుకు శుభాకాంక్షలు తెలిపారు.