నిర్మాణ పనుల్లో భద్రత గాలిలో...!
ప్రమాదకరంగా పాఠశాల భవన నిర్మాణం
విద్యార్థులు ఆదమరిస్తే ప్రమాదమే
పట్టించుకోని అధికారులు
వాంకిడి, (విజయక్రాంతి): స్థానిక మండల కేంద్రంలోని పీఎం శ్రీ పథకం కింద జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.2.30 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బాలుర వసతి గృహ పనులు కొనసాగుతున్నప్పటికీ భద్రతా చర్యలు లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పిల్లర్ల నిర్మాణం కోసం తవ్విన భారీ గుంతలు విద్యార్థులకు ప్రాణాపాయం కలిగించేలా కనిపిస్తున్నాయి. ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 700 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఆట విరామ సమయంలో విద్యార్థులు నిర్మాణ ప్రదేశం వద్దకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ హెచ్చరిక బోర్డులు లేదా రక్షణ కంచెలు ఏర్పాటు చేయలేదు. నిర్మాణం పాఠశాల ప్రాంగణంలోనే జరుగుతుండటంతో అప్రమత్తత లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశముందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పనులు కొనసాగుతున్న నేపథ్యంలోనే విద్యార్థుల భద్రత కోసం వెంటనే రక్షణ ఏర్పాట్లు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు




