రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి
బాన్సువాడకు చెందిన నటరాజ్ నాట్యమండలి నిర్వాహకుడు
నిజామాబాద్ జిల్లా గాంధీనగర్ వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్
శోకసంద్రంలో బాన్సువాడ
మంచి కళాతపస్విని కోల్పోయామని కళాభిమానుల ఆవేదన
బాన్సువాడ,(విజయ క్రాంతి): నిజామాబాద్ నగర శివారులోని గాంధీనగర్ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడకు చెందిన ప్రముఖ నృత్య కళాకారుడు, నటరాజ్ నాట్యమండలి నిర్వాహకుడు, డాన్స్ మాస్టర్ అన్నం అనిల్ (34) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అనిల్ మంగళవారం ఉదయం బైక్‌పై బాన్సువాడ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా, నిజామాబాద్ నుంచి బాన్సువాడ వైపు వస్తున్న బాన్సువాడ డిపో ఆర్టీసీ బస్సు గాంధీనగర్ క్రాసింగ్ వద్దకు చేరుకుంది.
అదే సమయంలో అనిల్ బైక్ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అనిల్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న డిపో మేనేజర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కళారంగానికి తీరని లోటు...
వేదికపై తన నాట్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అనిల్ మృతి బాన్సువాడ కళారంగాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అనిల్‌కు నృత్యం కేవలం ఒక కళ కాదు, అది అతని జీవనశైలి. భావ వ్యక్తీకరణ, లయ, అభినయంతో ప్రతి ప్రదర్శనలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆయన అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు. స్థానిక సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి.ఊహించని రోడ్డు ప్రమాదం కళ కోసం కలలు కన్న ఓ మనసును, ఇంకా ఎన్నో వేదికలను అలరించాల్సిన ప్రతిభను ఒక్క క్షణంలో శాశ్వత నిశ్శబ్దంలోకి నెట్టేసింది.
అనిల్ మరణంతో బాన్సువాడ సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు ఏర్పడిందని అభిమానులు, శిష్యులు, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. “కళాకారులు మరణించరు వారి కళలో చిరస్థాయిగా జీవిస్తారు” అనే మాటను గుర్తు చేస్తూ, ఆయన నాట్య ప్రస్థానం జ్ఞాపకాల రూపంలో చిరకాలం నిలిచి ఉంటుందన్నారు. అన్నం అనిల్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని పలువురు ప్రార్థిస్తున్నారు.






