ప్రజల రక్షణ కోసమే నిరంతర తనిఖీలు
సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్
చర్చికాంపౌండ్ ప్రాంతంలో పోలీసుల కార్డెన్ సెర్చ్
ప్రతి ఒక్క ఇల్లు తనిఖీ..- 80 వాహనాలు సీజ్
సూర్యాపేట, జూలై 12 (విజయక్రాంతి): ప్రజల రక్షణ కోసం పోలీసులు ఉన్నారని, నేరాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ప్రజల రక్షణకోసమే నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. ఆదివారం తెల్లవారుజామున పట్టణంలోని చర్చి కాంపౌండ్ కాలనీలో పోలీస్ లు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సూర్యాపేట డివిజన్ డిఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన భద్రతంకల్పించడం, సమాజంలో నేరాలు జరగకుండా అరికట్టడం, ప్రజల్లో నమ్మకాన్ని పెనచడం లో భాగంగా జిల్లా ఎస్పి నరసింహ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాం అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు పట్ల, అక్రమ రవాణా పట్ల, గంజాయి పట్ల పోలీసులకు సమాచారం ఇవ్వాలి డయల్ 100, 112 లకు తెలియజేయాలని కోరారు. కాలనీలో రక్షణగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అన్నారు.
పోలీసు శాఖ అనుక్షణం రక్షణ కల్పిస్తూ రాత్రింబవళ్ళు గస్తీ నిర్వహిస్తుందని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని కారణంగా 80 వాహనాలను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో పట్టణ సీఐ వెంకటయ్య, పలువురు ఎస్‌ఐలు, వంద మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






