ఆశలు నీరుగారుతున్నాయ్!
- మూడేళ్లుగా నిలిచిన రఘుపతి పేట బ్రిడ్జి నిర్మాణ పనులు.
- వాగులో దెబ్బతిన్న రోడ్డు
- నిత్యం ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు
కల్వకుర్తి ఏప్రిల్ 22: నిత్యం రద్దీగా ఉండేకల్వకుర్తితెలకపల్లి ప్రధాన రహదారిపై రఘుపతిపేట వద్ద దుందుభి వాగులో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు ఏడాదికిపైగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్ల క్రితం సుమారు రూ.45 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు, నిధుల కొరతతో మధ్యలోనే ఆగిపోయింది.
గతేడాది జూన్లో భారీ వర్షాలు కురవడం, దుందుభి వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల పనులు నిలిపివేశామని అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వాగులో నీటి మ ట్టం పూర్తిగా తగ్గినా, పనులు తిరిగి ప్రారం భం కాలేదు. దీంతో పనుల పునఃప్రారంభంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దెబ్బతిన్న రోడ్డుతో నిత్యం ప్రమాదాలు
దుందుభి వాగులో ఇప్పటికే ఉన్న రహదారి వాగు ప్రవాహానికి దెబ్బతిని ప్రమాదక రంగా మారింది. రోజూ ఈ మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు గోతు ల్లో పడుతూ గాయపడుతున్నారు. కార్లు, ఇతర వాహనాలు దెబ్బతింటున్నాయి. అ యినప్పటికీ, తాత్కాలిక మరమ్మతులు కూ డా చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది.ఈ రహదారి ద్వారా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశించారు. కానీ పనులు నిలిచిపోవడంతో ఆ ఆశలు నీరుగారుతున్నాయి.వాగులో పిలర్లు నిర్మాణం పూర్తయినప్పటికీ, మిగతా పనుల్లో తీవ్ర జాప్యం కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి వర్షాలు కురవక ముందే బ్రిడ్జి పనులు ప్రారంభించాలని, కనీసం తాత్కాలికంగా రహదారి మరమ్మతులు చేసి రాకపోకలకు సౌకర్యం కల్పించాలని ప్రజలు, వాహనదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






