భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర
హైదరాబాద్: 22ఏలో చేర్చిన భూముల్లో కొన్ని ప్రభుత్వమే ప్రజలకు ఇచ్చిందని, మరి కొన్నింటిని పరిశ్రమల కోసం ఇచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వమే లే ఔట్లు వేసి విక్రయించిన భూములను నిషేధిత జాబితాలో చేర్చారని, గతంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన దానికంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండడుగులు ముందుకెళ్లారని చెప్పారు. రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను కాంగ్రెస్ సర్కార్ లాక్కుని భూమాఫియాకు కట్టబట్టే కుట్ర చేస్తుందని ఎంపీ మండిపడ్డారు.
ధరణి పోయినా.. ప్రభుత్వం భూములు లాక్కునే ధోరణి మారలేదని, గతంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కంచే చేను మేసినట్లుగా భూదందా చేసిందని ఎంపీ ఈటల ఆరోపించారు. కేసీఆర్ భూమాఫీయాకు కట్టబెట్టిన భూములను రేవంత్ రెడ్డి సర్కార్ సెటిల్ మెంట్ చేసుకుంటోందని, ఈ భూదందాలో సంపాదించిన డబ్బును హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఖర్చు చేశారు. గల్ఫ్ ఆయిల్ కంపెనీ భూములు ఫీనిక్స్ కంపెనీ మీదుగా చేతులు మారిందని, అసైన్డ్ భూములను కూడా పట్టా భూములకు ఇచ్చినట్లే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొహెడలో 70 ఏళ్ల క్రితం పట్టాలు ఇచ్చిన భూములను ఇటీవల లాక్కున్నారని, ఈ ప్రభుత్వం మాత్రం అసైన్డ్ భూములకు ఏమీ చెల్లించకుండా లాక్కుంటోందని ఎద్దేవా చేశారు.






