18 August, 2026 | 3:22 PM

బహుజన ఆత్మగౌరవానికి తొలి పతాకం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

18-08-2026 02:20 PM

ఆదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): బహుజన ఆత్మగౌరవానికి తొలి పతాకం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, వారి జీవిత చరిత్ర నేటి తరాలకు ఆదర్శనీయమని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అన్నారు. మంగళవారం సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలలో భాగంగా  కలెక్టరేట్ లో  వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, గౌడ సంఘాల నాయకులు, బి.సి. సంఘాల నాయకులతో కలిసి హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి అప్పటి మొగల్ పాలకుల అరాచకాలను ఎదిరించి గోలుగొండ పాలించిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలిపారు. పాలకులకు వ్యతిరేకంగా పోరాడి అణగారిన ప్రజలకు అండగా నిలిచారని, ప్రతి ఒక్కరు పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా గౌడ సంఘాల నాయకులు తీసుకువచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా నివేదిక సమర్పించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నదీమ్, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, గౌడ సంఘాల ప్రతినిధులు బాలేశ్వర్ గౌడ్, కేసరి ఆంజనేయులు గౌడ్, కొండ్ర మనోహర్ గౌడ్, మార్క శంకర్ గౌడ్, మహిళా సంఘాల ప్రతినిధులు నీరజ గౌడ్, గౌడ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.