21 July, 2026 | 10:56 PM

Breaking News

యువత గొంతుకకు కాంగ్రెస్ అండ

21-07-2026 12:38 AM

బండి రమేష్

కూకట్‌పల్లి, జూలై 20 (విజయక్రాంతి): యువత గొంతుకకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టిపిసిసి ఉపాధ్యక్షులు, కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అన్నారు. కూకట్పల్లి జేఎన్టీయూ ఆడిటోరియంలో  యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చత్రోన్ కి గూంజ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

ది యువభారతమని యువత భవితనే దేశ భవిత అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని, విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని విమర్శించారు. ప్రశ్నాపత్రాలు లీకులు, నిరుద్యోగం, ఉన్నత విద్యలో అవకాశాల కొరత వంటి సమస్యలు దేశంలో యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితులపై యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వారి హక్కుల సాధన కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి బల్మూరి వెంకట్, ఎన్ ఎస్ యు ఐ  జాతీయ అధ్యక్షులు వినోద్ జాకీర్, రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు తూము వేణు, నాగిరెడ్డి, పుష్ప రెడ్డి, గాలి బాలాజీ, శ్రీనివాస బాబు, రంగమోహన్, సాయిబాబా చౌదరి, గంధం రాజు , రాజేష్, శంకర్, పులి శివ గౌడ్ రామారావు, సునీల్, శ్రీకాంత్ పటేల్, మైకేల్, సంధ్యారాణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.