23 July, 2026 | 4:17 PM

నీట్ పరీక్ష లీకేజీపై కాంగ్రెస్ నిరసన

23-07-2026 03:32 PM

రాహుల్, ప్రియాంక అరెస్టులను ఖండించిన కోనరావుపేట నాయకులు

కోనరావుపేట, జూలై 23 (విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల మానుక సత్యం ఆధ్వర్యంలో నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం, విద్యార్థుల సమస్యలు, అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆరోపించారు.

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయని పేర్కొన్నారు. నెలల తరబడి కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యంతో ప్రమాదంలోకి నెట్టడం బాధాకరమని విమర్శించారు.ఈ ఘటనల నేపథ్యంలో మానసిక వేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని, వారికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర, పారదర్శక దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.విద్యా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

విద్యార్థుల హక్కుల కోసం గొంతెత్తిన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీలను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది పోయి, ప్రశ్నించిన వారిపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విమర్శించారు.విద్యా వ్యవస్థలో పారదర్శకత నెలకొని, ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.