28 March, 2026 | 3:31 AM

రూపాయి పతనంతో ఆందోళన

28-03-2026 01:45 AM
  1. డాలర్ తో పోలిస్తే రూ. 94.82 వద్దకు చేరిక
  2. పెరగనున్న దిగుమతి వస్తువుల ధరలు

న్యూఢిల్లీ, మార్చి 27: రూపాయి విలువ పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో రూపాయి విలువ రూ. 0.86 పైసల మేర పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూ. 94.82 వద్దకు చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి సుమారు ఐదు శాతం మేర క్షీణించడం గమనార్హం. రూపాయి పతనానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయం మార్కెట్లను వెంటాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 110 డాలర్ల మార్కును దాటడం భారత్ లాంటి దిగుమతి దేశాల కరెన్సీపై ఒత్తిడి పెంచుతోంది. చమురు ధరలు పెరగడంతో భారత్ దిగుమతి వ్యయం భారీగా పెరిగి, కరెన్సీ నిల్వలపై ప్రభావం చూపుతోంది.

భారత్ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం కూడా రూపాయి బలహీనపడటానికి కారణమైంది. రూపాయి విలువ పతనంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ముడిచమురు, వంటనూనెల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పడే ప్రమాదం పొంచి ఉంది.