13 June, 2026 | 9:14 PM

అధికారుల అండదండలతో నకిలీ పత్రాలు

13-06-2026 07:53 PM

ఎర్రగుంట చెరువు ఆక్రమణపై సమగ్ర విచారణ చేపట్టాలి 

ఆయకట్టు రైతుల డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): అధికారుల అండదండలతో నకిలీ పత్రాలు సృష్టించి ఎర్రకుంట చెరువును అక్రమంగా కబ్జా చేశారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని ఎర్రకుంట గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. బీఆర్‌ఎస్‌ నేత చండ్ర వెంకటేశ్వర్ అనే వ్యక్తి ఈ చెరువును ఆక్రమించాడని ఆరోపిస్తూ గత రెండు రోజులుగా రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ఎర్రకుంట చెరువు లోపలే వినూత్నంగా విలేకరుల సమావేశం నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

రైతులు మాట్లాడుతూ.. 1975 నాటి నుంచి ఉన్న ఈ చెరువు వందలాది మంది రైతులకు, పశువులకు జీవనాధారంగా నిలిచిందన్నారు. గత పదేళ్లుగా ఈ చెరువు కింద పండించే పంటలకు తాము ప్రభుత్వానికి శిస్తు (పన్ను) కూడా చెల్లిస్తున్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ, కొందరు స్వార్థపరులైన నాయకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు అక్కడ చెరువే లేదని రెవెన్యూ అధికారులు చెప్పడంపై రైతులు తీవ్ర విస్మయం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీపీఎం మద్దతుతో ఎర్రకుంట చెరువు ఆక్రమణలపై గ్రామ రైతులు గత పదేళ్లుగా పోరాటం చేస్తున్నారనీ, సీపీఎం ఆధ్వర్యంలో పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా  ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సీపీఎం జిల్లా నాయకులు దొడ్డ రవికుమార్ మాట్లాడుతూ.. "వందలాది మంది రైతులకు జీవనాధారమైన చెరువును ఒక వ్యక్తి ఆక్రమణ కు పాల్పడితే అధికారులు సహకరించడం శోచనీయమన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి తప్పుడు దృవీకరణ పత్రాలపై విచారణ నిర్వహించి చెరువును ఆక్రమించిన అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.