20 August, 2026 | 4:17 PM

ఇందిరమ్మ ఇండ్ల జాబితా ఆపాలని ఎంపీడీవోకు ఫిర్యాదు

20-08-2026 03:55 PM

గంభీరావుపేట, ఆగస్టు 20: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొందరు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను వెంటనే నిలిపివేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిమ్మల తిరుపతి గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ నాయకులతో కలిసి ఎంపీడీవో రాజేందర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులకు కాకుండా డబ్బులు తీసుకుని అనర్హుల పేర్లు జాబితాలో చేర్చారని తమ దృష్టికి వచ్చిందన్నారు. నిజమైన అర్హులను గుర్తించేందుకు పదిహేను రోజుల గడువు ఇస్తే తుది జాబితాను తాము సిద్ధం చేసి అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకే చేరాలన్నదే లక్ష్యమని, అవినీతి కారణంగా ఆ లక్ష్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా, పెన్షన్లు, కుట్టు మిషన్ల వంటి పథకాలు పారదర్శకంగా అర్హులకు అందాలని, తమకు తెలియకుండా జాబితా ఎలా ఖరారు చేస్తారని ఎంపీడీవో తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా మండల అధికారులు తమ విధానాన్ని మార్చుకుని పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కూడేల్లి ప్రవీణ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏడబోయిన ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మల్యాల రాజ్వీర్, నాయకులు బంగ్లా రాజు గౌడ్, శంకర్ రాజశేఖర్, నరేష్ వర్మ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.