మొన్న కురిసిన వడగండ్ల వర్షం రైతు వెన్నెముకను విరిచేసింది
చేగుంట,(విజయక్రాంతి): ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా చేగుంట మండలంలోని కర్నాల్ పల్లి, మక్కరాజుపేట్, గొల్లపల్లి, రాంపూర్, కన్యారం, చందాయిపేట్ గ్రామాలతో పాటు చేగుంట, నార్సింగి మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వయంగా నష్టపోయిన పంట పొలాలను శనివారం పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుగాలం చెమటతో పండించిన పంట క్షణాల్లో నేలమట్టం కావడం ఎంతో బాధాకరమని, పంట మాత్రమే కాదు, రైతుల ఆశలు కూడా తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వర్షం దెబ్బకు పంటలు పూర్తిగా నాశనం కావడంతో గడ్డి కూడా మిగలని పరిస్థితి ఏర్పడిందని, అప్పులు చేసి, కౌలు తీసుకుని సాగు చేసిన రైతులు ఈ విపత్తుతో పూర్తిగా ఆగమైపోయారని, ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులకు ఇది మరింత భారంగా మారిందన్నారు.
గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభుత్వం సరైన సహాయం అందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఎకరాకు కనీసం ₹25,000 వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని స్పష్టం చేశారు.






